Telangana Government Preparing To Vaccinate Everyone In State - Sakshi

Telangana: 15 రోజుల్లో కోటి టీకాలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Sep 16 2021 3:51 AM | Updated on Sep 16 2021 11:42 AM

Government Preparing To Vaccinate Everyone In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో రాష్ట్రంలో అందరికీ టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో కోటి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కార్యాచరణ ప్రకటించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. టీకాలు వేసేందుకు గురువారం నుంచి రోజు వారీ స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రెండు డోసులూ పూర్తి చేయాలని నిర్ణయించింది. టీకా ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల టీకా డోసులు వేశారు. కోటి డోసులు 165 రోజుల్లో వేశారు. తర్వాత 2 కోట్ల డోసుల మార్కును 78 రోజుల్లో చేరుకున్నారు. రాష్ట్రంలో 52 శాతం అర్హులకు మొదటి డోసు ఇచ్చారు. 

ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు కూడా..
కనీసం పది ఇరవై మంది ఉన్న ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాలు, దుకాణాల వంటి చోట్లకు కూడా వెళ్తారు. వారందరికీ అక్కడికక్కడే టీకా ఇస్తారు. ఎవరైనా తమ కార్యాలయంలో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే, సంబంధిత స్థానిక అధికారులకు తెలియజేస్తే నిర్ణీత తేదీన వ్యాక్సినేషన్‌ చేపడతారు. గ్రామాల్లో వ్యాక్సిన్‌ వేసే రోజున ప్రత్యేకంగా చాటింపు వేస్తారు. మొత్తం మీద రోజుకు ఆరేడు లక్షల మందికి వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

అధికారుల కృషి అభినందనీయం: సీఎస్‌
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడంపై సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీలో దాదాపు అందరికీ మొదటి డోసు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హై ఎక్స్‌పోజర్‌ గ్రూప్‌లలో ఉన్న 38 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రోస్, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.


స్పెషల్‌ డ్రైవ్‌ మార్గదర్శకాలు
– నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీకాల శిబిరాలు ప్రారంభించాలి
– గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు యూనిట్‌గా ఉంటాయి. 
– సబ్‌–సెంటర్‌లోని అన్ని ఆవాసాలను ముందుగా షెడ్యూల్‌ చేసిన క్యాంప్‌ల ద్వారా కవర్‌ చేయాలి. నివాసాల వారీగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేయాలి. 
– పట్టణ ప్రాంతాల్లో వార్డులు యూనిట్‌గా ఉంటాయి. 
– వార్డులోని అన్ని కాలనీలు/మురికివాడల్లో ముందుగా షెడ్యూల్‌ చేసిన క్యాంపుల ద్వారా కవర్‌ చేయాలి. కాలనీ/మురికివాడల వారీగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలి. 
– టీకా శిబిరం కోసం భవనం లేదా టెంట్లు, కుర్చీలు మొదలైనవి సమకూర్చాలి.
– టీకా కేంద్రాల వద్ద సైడ్‌ ఎఫెక్టŠస్‌ వచ్చే కేసులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు 108 లేదా ఆర్‌బీఎస్‌కే వాహనాలను సిద్ధంగా ఉంచాలి. అలాగే జిల్లా స్థాయిలో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. 
– సైడ్‌ ఎఫెక్టŠస్‌ కేసుల కోసం అన్ని ఏరియా, జిల్లా ఆసుపత్రులలో పడకలు, వైద్యులను 24 ్ఠ7 అందుబాటులో ఉంచాలి. 

మొబైల్‌ వ్యాన్లతో ఇంటింటికీ వెళ్లి
పదిహేను రోజుల్లో కోటి టీకాల కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను చేపడతారు. మొబైల్‌ వ్యాన్లతో వీధివీధికీ, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేయాలని భావిస్తున్నారు. ఒక వీధికి వెళ్లాక వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వారు వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేదా? అని ఆరా తీస్తారు. ఎవరైనా వేసుకోవాల్సి ఉంటే వారికి అక్కడికక్కడే వేస్తారు. ఇంట్లో అర్హులంతా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఆ ఇంటి డోర్‌పై ‘ఫుల్లీ వ్యాక్సినేటెడ్‌ హోం’అనే స్టిక్కర్‌ను వేయాలని కూడా యోచిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎవరికైనా టీకాలపై అనుమానాలుంటే అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛందం పేరిట వారి ఇష్టానికి వదిలేయకూడదని అధికారులు భావిస్తున్నారు.

త్వరలో 12–18 వయసున్న వారికీ
12–18 ఏళ్ల వయసున్న దాదాపు 48 లక్షల మందికి కూడా టీకా వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో వేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement