భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పంట పొలాల్లో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకాల ప్రత్యేక డ్రైవ్‌కు ఆటంకం ఏర్పడింది. ఆరు రోజుల పాటు ఉధృతంగా కొనసాగిన ప్రత్యేక వ్యాక్సినేషన్ వేగం తగ్గింది. వ్యాక్సిన్ల కొరతే దీనికి కారణమని, కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరుకల్లా కోటి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వ్యాక్సిన్ల కొరతతో అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న టీకాలతో సాధారణ స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని వెల్లడించాయి. ప్రత్యేక డ్రైవ్ కోసం రాష్ట్రానికి 50 లక్షల టీకాలు పంపించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపాయి.
రోజుకు ఏడు లక్షలు ఇచ్చేలా..
కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18ఏళ్లు పైబడి, వ్యాక్సిన్ తీసుకునే అర్హత ఉన్న 2.80 కోట్ల మందికి టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 2.29 కోట్ల డోసులు వేయగా.. అందులో మొదటి డోస్ 1.66 కోట్ల మందికి, రెండు డోసులు 62.72 లక్షల మందికి ఇచ్చారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే మొదటి, రెండో డోస్ టీకాలు తీసుకోవాల్సిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో వేగంగా టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు కరోనా టీకాల ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో 7,319 బృందాలను ఏర్పాటు చేసింది. పట్టణాలు, పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టింది. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దాదాపు 29.42 లక్షల మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఈ నెల 18న ఏకంగా 6.36 లక్షల డోసులు ఇచ్చామని.. 21న 5.32 లక్షల డోసులు, 17న 5.27 లక్షల డోసులు వేశామని వెల్లడించారు. రోజుకు ఏడు లక్షల టీకాలు వేసేలా ఏర్పాట్లు చేశామని.. వ్యాక్సిన్ల కొరతతో ఆటంకం ఏర్పడిందని తెలిపారు.
పిల్లల టీకాపై అస్పష్టత
12–18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ నెల 15వ తేదీ నుంచే టీకాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పిల్లల టీకాలకు సంబంధించి ఆయా కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. దీంతో పిల్లల టీకాలు రాలేదని.. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న సమాచారం కూడా లేదని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment