సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఒకరైన పారిశుద్ధ్య కార్మికులకు త్వరలో ఉచితంగా వ్యాక్సిన్లు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో పనిచేస్తున్న సుమారు 75 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ సేకరిస్తోంది. స్వీపర్లు, చెత్త కుండీలను ఖాళీ చేసే వారు, మురికి కాల్వలు శుభ్రం చేసేవారు, ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే వారు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ వర్కర్లు, వ్యర్థాలు తరలించే ట్రాక్టర్లు/డంపర్లు/ఇతర వాహనాల డ్రైవర్లు, స్వచ్ఛ ఆటోలు/రిక్షా కార్మికుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
‘గ్రేటర్’లోనే 30 వేల మంది..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 వేల మంది, రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో మరో 30 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సేవరేజీ బోర్డు (జల మండలి) పరిధిలో మరో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోవిన్ (CoWIN) మొబైల్ యాప్‌లో వీరి వివరాలను నమోదు చేసే ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది.
సామాన్యులకు యాప్..
వ్యాక్సినేషన్ కోసం ఎవరైనా సరే కోవిన్ యాప్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా, సామాన్య ప్రజలకు ఇంకా ఈ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ యాప్ ద్వారా ఫ్రంట్‌లైన్ వారియర్ల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రమే కొంతమంది ప్రభుత్వ అధికారులకు యాక్సెస్ సదుపాయం కల్పించింది. పారిశుద్ధ్య కార్మికుల వివరాలను సేకరించేందుకు... జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని మరో 12 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పురపాలక శాఖ డైరెక్టరేట్‌లోని ఇద్దరు రీజనల్ డైరెక్టర్లకు కోవిన్ యాప్ యాక్సెస్ సదుపాయం కల్పించారు.
పారిశుద్ధ్య కార్మికుల పేరు, వయసు, చిరునామాతో పాటు ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వివరాలను సేకరిస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు మళ్లీ 28 రోజులకు రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్లను సైతం తీసుకుంటున్నారు. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికుల వివరాలను సైతం సేకరిస్తున్నారు.
వీరికి సైతం వ్యాక్సిన్..
ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్నులు వసూలు చేయడం, కోవిడ్ కాంటాక్టులను గుర్తించడం, బహిరంగ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేయడం వంటి విధుల్లో పాల్గొనే మున్సిపాలిటీల ఇంజనీర్లు, రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆపరేటర్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, ఫికల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు, దహనవాటికల్లో పనిచేసే మున్సిపల్ సిబ్బంది, సివిల్, ఎలక్ట్రికల్, ఇతర మెయింటెనెన్స్ పనుల్లో పనిచేసే జూనియర్ ఇంజనీర్లు, వాటర్ మీటర్ రీడర్లు, ప్లంబర్లు, వాటర్ సప్లై లైన్‌మెన్, పార్కుల నిర్వహణ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వారికి సైతం టీకాలు వేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం వీరి వివరాలను సైతం సేకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన వివరాలను సైతం పురపాలక శాఖ సేకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment