
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న వైఎస్ భారతీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు గర్వించే విజయాలు సాధించిన వారికి తగిన గుర్తింపును అందించడంలో సాక్షి మీడియా గ్రూప్ కృషి ప్రశంసనీయమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారిని గౌరవించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 9వ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయం, క్రీడలు, ఆరోగ్యం, పర్యావరణం లాంటి రంగాల్లో అవార్డు గ్రహీతలు సమాజంపై చెప్పుకోదగిన ప్రభావం చూపారని, వారి శ్రమకు ఈ పురస్కారాలు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీ గవర్నర్.. ‘మానవ సేవను మించిన అత్యుత్తమ మతం లేదు..’ అన్న ఉడ్రో విల్సన్(ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు) సూక్తిని ఉటంకించారు. సమాజ సేవ చేసే ఎన్జీవోలు, సంస్థలు, విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ పనితీరును ఆయన అభినందించారు.
వ్యయ ప్రయాసలకోర్చి సాక్షి మీడియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందన్నారు. అవార్డు గ్రహీతలను.. పేరు పేరునా వారి విజయాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నజీర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. రైతుల కష్టాలను కళ్లకు గట్టిన సుమధుర ఆర్ట్స్ అకాడమీ నృత్య రూపకం, ఇతర సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment