పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న గవర్నర్ తమిళి సై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సనత్‌నగర్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు’, ‘హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు’, ‘భాగ్యనగర్ రేడియో’అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ప్రధానిగా పీవీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు.
దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివాళులు అర్పించినవారిలో ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి తదితరులు ఉన్నారు.
పీవీకి నివాళులు అర్పించిన గవర్నర్
పీవీ జ్ఞానభూమిలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరై నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కేవీపీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితర ప్రముఖులు పీవీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment