సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్– మంచిర్యాల–రామగుండం–ఖమ్మం ఇది మన రాష్ట్రంలో ఒక రైలు మార్గం. అంతేకాదండోయ్... ఈ దారి పొడవునా నకిలీ విత్తనాల కేసులున్నాయి. అంటే, మహారాష్ట్ర నుంచి ప్రయాణికుల రాకపోకలే కాదు, నకిలీ విత్తనాలు కూడా ప్రవేశిస్తున్నాయన్నమాట. ఈ మహారాష్ట్ర మకిలీ మన రాష్ట్ర రైతుకు మిక్కిలి కష్టాలను, నష్టాలను మిగులుస్తోంది. ప్రతిఏటా ఇదే తంతు. రైతులు ఆరుగాలం చేసిన శ్రమ నకిలీ విత్తనాల కారణంగా మట్టిలోనే కలసిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న రూ.వేల కోట్ల రూపాయల ధనం నకిలీ విత్తనాల కారణంగా వృథాగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడదలేకుండా చేయాలని ఇటీవల డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది.
వ్యవసాయ అధికారులతో కలసి ఈ టాస్క్‌ఫోర్స్‌కు రూపకల్పన చేశారు. ఈ నకిలీ విత్తనాలేవీ కూడా మన రాష్ట్రంలో తయారుకావు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ప్రత్యేక వ్యూహం ఖరారు చేశారు. ఇందు కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీసు– వ్యవసాయాధికారుల ప్రత్యేక సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి అనుమానితులపై నిఘా పెట్టారు. పోలీసు, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం, సంప్రదింపుల నిమిత్తం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులకు నకిలీ విత్తనాల గుర్తింపుపై శిక్షణ ఇవ్వనున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై వెంటనే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. ఏ వ్యాపారి అయినా విత్తన ప్యాకెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా వెంటనే లైసెన్స్ రద్దయ్యేలా చర్యలు చేపడతారు.
అధికంగా మహారాష్ట్ర నుంచే..
నకిలీ విత్తనాల్లో అధికశాతం మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత దేశం వెళ్లే రైలు రూటే వీరికి ప్రధాన మార్గం. అందుకే, అధికారులు ఈసారి ప్యాసింజర్ రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఏపీలోని కర్నూలు కేంద్రంగా సాగుతున్న దందా కూడా గుట్టుచప్పుడు కాకుండా అనేక మార్గాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించినట్లు పోలీసులకు సమాచారం ఉంది.
పీడీ యాక్ట్ కింద 27 కేసులు
తెలంగాణలో 2016 నుంచి 2020 వరకు నకిలీ విత్తనాలపై పోలీసులు 27 పీడీ యాక్ట్ కేసులు పెట్టారు. వీటిలో అధికంగా ఖమ్మం(7), రాచకొండ(7), రామగుండం (4) కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. అందులో 14 కేసులు కేవలం 2020లోనే నమోదవడం గమనార్హం.
అనుమానం వస్తే ఫిర్యాదు చేయండి: ఐజీ నాగిరెడ్డి
రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ విత్తనాల వల్ల ఏ రైతు కుటుంబమూ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయం. నకిలీ విత్తనాలపై మీ వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అధికధరలు, నకిలీ విత్తనాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.
(చదవండి: తాగి రచ్చ చేసిన వరుడు.. పెళ్లికి నిరాకరించిన వదువు)
Comments
Please login to add a commentAdd a comment