విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు | Govt Start Rationalisation Process Of Government Teachers | Sakshi
Sakshi News home page

విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు

Published Wed, Aug 18 2021 2:10 AM | Last Updated on Wed, Aug 18 2021 8:19 AM

Govt Start Rationalisation Process Of Government Teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లల హేతుబద్ధీకరణకు సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జారీ చేశారు. ఈ నెల 12నే ఉత్తర్వులు జారీ చేసినా వాటిని రహస్యంగా ఉంచడం గమనార్హం. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూ–డైస్‌) 2019–20 గణాంకాల ఆధారంగానే హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులుండేలా చర్యలు చేపట్టనున్నారు. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలకు బదలాయిస్తారు.

విద్యార్థుల సంఖ్యను బట్టి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయుల నిష్పత్తిని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. హేతుబద్ధీకరణను సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా స్థాయిలో కమిటీ వేసింది. కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడే ఈ కమిటీలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల), జిల్లా పరిషత్‌ సీఈవో, ఐటీడీఏ పీవో, డీఈవో భాగస్వాములుగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సమస్యలుంటే హైదరాబాద్‌ డీఎస్సీకి పది రోజుల్లోగా అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు.

ఈ ప్రక్రియలో కొత్త పోస్టు సృష్టించడం, రద్దు చేయడం జరగదని స్పష్టం చేశారు. ఒకే ప్రాంగణంలో ఉండే పాఠశాలల విలీన విధానాన్ని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ బదిలీలో పాఠశాలలో సీనియారిటీ ఇన్‌ సర్వీస్‌ను కొలమానంగా తీసుకుంటారు. జూనియర్‌గా ఉన్న ఉపాధ్యాయుడినే మిగులుగా గుర్తిస్తారు. ఒకవేళ సీనియర్‌ ఉపాధ్యాయుడు విముఖత వ్యక్తం చేస్తే జూనియర్‌కు అవకాశం దక్కుతుంది. హేతుబద్ధీకరణ ప్రక్రియపై విద్యాశాఖ కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. 


150 దాటితేనే హెడ్‌ మాస్టర్‌... 
ప్రాథమిక పాఠశాలల్లో 151 మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. అయితే కనీస విద్యార్థుల సంఖ్య 19లోపు ఉన్నప్పటికీ ఆ స్కూల్‌లో ఎస్టీటీ పోస్టు మంజూరు చేస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రాథమికోన్నత పాఠశాలల్లో... 
ఆరు నుంచి 8వ తరగతి వరకూ వంద మంది విద్యార్థుల వరకూ గణితం, సైన్స్‌కు కలిపి ఒకరు, సోషల్‌ సైన్స్‌కు ఒకరు, లాంగ్వేజెస్‌కు ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ఉపాధ్యాయులుంటారు. సీనియర్‌ ఉపాధ్యాయుడు హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తారు.  
101–140 మంది విద్యార్థులుంటే ఇంగ్లిష్‌ టీచర్‌తోపాటు మొత్తం ఐదుగురు, 141–175 మంది ఉంటే సైన్స్, గణితానికి ఇద్దరు చొప్పున ఆరుగురు, 176–210 మంది విద్యార్థులకు సైన్స్, గణితం ముగ్గురుతోపాటు మొత్తం ఏడుగురు, 211–245 వరకూ 8 మంది, 246–280 వరకూ 9, 281–315 వరకూ 10, 316–350 మంది విద్యార్థులకు 11, ఆపైన 385 మంది వరకూ 12 మంది టీచర్లు ఉంటారు. 

ఉన్నత పాఠశాలలో.. 
220 మంది విద్యార్థుల వరకూ ఒక హెచ్‌ఎంతోపాటు 9 మంది ఉపాధ్యాయులంటారు. 400 మంది విద్యార్థుల సంఖ్య దాటితే క్రాఫ్ట్‌ లేదా డ్రాయింగ్‌ లేదా సంగీతం టీచర్‌ను కేటాయించాలి. గణితం, ఫిజికల్‌ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్, ప్రథమ, ద్వితీయ భాషా పండితులు ప్రతి స్కూల్‌లోనూ ఉంటారు. విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ సబ్జెక్ట్‌ టీచర్లు పెరుగుతారు. 1,210 మంది విద్యార్థులుండే స్కూళ్లకు 45 మంది వరకూ ఉంటారు. 
ఆంగ్ల మాధ్యమం కోసం ఏర్పాటు చేసే అదనపు సెక్షన్లకు 50 మంది విద్యార్థుల వరకూ నలుగురు టీచర్లు ఉంటారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 420 వరకు ఉంటే 8 మంది దాకా టీచర్లు ఉంటారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు అవసరాన్నిబట్టి బదలాయిస్తారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు 50కి తక్కువగా ఉంటే దగ్గర్లోని స్కూళ్లలో వారిని చేరుస్తారు.

ఇది హేతుబద్ధం కాదు... 
2019–20 ఏడాది విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవడం అసంబద్ధం. కరోనాతో స్కూళ్లు నడవక, సంక్షేమ హాస్టళ్లు తెరవక అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేవు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల కేడర్‌ విభజన కొలిక్కి రాలేదు. అంతర్‌ జిల్లా, సాధారణ బదిలీలు, పదోన్నతులను పాత జిల్లాల ప్రకారం చేస్తామన్న హామీ నెరవేరకుండా రేషనలైజేషన్‌ సరికాదు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష జీవో ఇవ్వడమేంటి? ఈ ప్రక్రియను వాయిదా వేయాలి. 
– తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) నేతలు కె.జంగయ్య, రవి 

మార్గదర్శకాలు సవరించాలి : టీఎస్‌టీయూ 
పాఠశాల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను సవరించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులుంటే కనీసం ఇద్దరు టీచర్లు, ఆ పైన సంఖ్య ఉంటే, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 50 మందికన్నా ఎక్కువ ఉంటే హెచ్‌ఎం పోస్టు కేటాయించాలి. 
– తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి 

ఈ విధానం హాస్యాస్పదం 
కొత్త జిల్లాలు, జోనల్‌ విధానంలో క్యాడర్‌ విభజన జరగకుండా రేషనలైజేషన్‌ చేపట్టడం హాస్యాస్పదం. గతేడాది సెప్టెంబర్‌ 30 నాటి విద్యార్ధుల సంఖ్యను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడం తప్పుడు నిర్ణయం. తాజా లెక్కలు తీసుకోవాలి. 
– తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ షౌకత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి నాగనమోని చెన్నరాములు  

ప్రత్యక్ష బోధన తర్వాతే... 
ప్రాథమిక తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలైన తర్వాతే విద్యార్థుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేపట్టాలి. ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జీవో ఇవ్వాలి. ఉపాధ్యాయుల సాధారణ, అంతర్‌ జిల్లా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలి. 
–రాష్ట్ర సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకినేని మధుసూదన్‌రావు    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement