వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు.
ప్రేమ వివాహం నచ్చనందుకే..!
పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది.
శిశు విహార్‌కు తరలింపు
శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment