సాక్షి, హైదరాబాద్: సొంతంగా స్థలాలున్న పేదలు వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసే ‘గృహలక్ష్మి’ పథకానికి జూలైలో శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయి తే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, జాబితాల రూపకల్పన బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది.
బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా..
‘పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనే ఈ పథకానికి రూ.12 వేల కోట్లను కేటాయించింది. కానీ పథకానికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేయకపోవటంతో అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం తిరిగి రూ.12 వేల కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటివరకు మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలను ఆర్థిక సాయంగా అందిస్తుంది. లబ్ధిదారులు అవసరమైన అదనపు మొత్తాన్ని కలిపి సొంత జాగాలో కావాల్సిన విధంగా ఇంటిని నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో..
కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. జూలై నెలలో పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఉన్నతాధికారులు భేటీ అయి ఈ పథకం తీరు తెన్నులపై చర్చించారు. వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. త్వరలో సీఎం నుంచి అనుమతి వస్తుందని, ఆ వెంటనే మార్గదర్శకాలు, ఇతర అంశాలపై కసరత్తు ముమ్మరం చేస్తామని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ పథకం కీలకంగా మారుతుందని.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే విషయంలో స్థానిక శాసనసభ్యులకే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
కనీసం స్థలంపై అస్పష్టత
సొంత స్థలమున్న పేద లబ్ధిదారులకే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఈ స్థలం ఎంత ఉండాలన్న విషయంలో మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంత స్థలం ఉంటే మంచిదన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇక కులాల వారీగా ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేయాలన్న విజ్ఞప్తులూ ఉన్నాయి. వీటన్నింటిపై మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ‘గృహలక్ష్మి’కి అర్హతల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కనీస స్థలం పరిమితులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిందని వివరించాయి. మొత్తంగా ఆగస్టు నాటికి అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్న దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించాయి.
‘గృహలక్ష్మి’పై కదలిక: ఎంపిక ఎమ్మెల్యేలకే?
Published Mon, May 29 2023 3:49 AM | Last Updated on Mon, May 29 2023 9:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment