ఫ్యాషన్‌ With కాషన్‌ | growing up Piercing is crazy | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ With కాషన్‌

Published Wed, Jul 3 2024 8:52 AM | Last Updated on Wed, Jul 3 2024 12:08 PM

growing up Piercing is crazy

స్టైల్‌గా కనపడడం కోసం సిటిజన్లు దేనికైనా సై అంటున్నారు. కేశాలకు దట్టించే కలర్స్‌ నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్‌ వరకూ తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలని, అందుకోసం దేనికైనా రెడీ అంటున్నారు..ఈ ట్రెండ్‌ అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని  కొనితెస్తోంది. ఫ్యాషన్‌ ప్రియుల్ని సిటీలో స్కిన్‌ స్పెషలిస్టులు, ఫిజియో థెరపిస్ట్‌లు... తదితర  వైద్యులు, నిపుణుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తోంది. 

 ఏం చేస్తావో నాకు తెలీదు...నా లుక్‌ చూసి మా కంపెనీలో కొలీగ్స్‌కి మెంటలెక్కాలి....తన హెయిర్‌ స్టయిలిస్ట్‌ దగ్గర ఓ ఉద్యోగి ఆర్డర్‌ లాంటి అభ్యర్థన... వెళ్లేది పేజ్‌ త్రీ పారీ్టకి.. అక్కడ ఫ్యాషన్‌ షోని మించిన అవుట్‌ఫిట్స్‌తో వస్తారు.. అలాంటి చోట సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనపడాలి. దానికి నువ్వేం చెప్పినా నేను రెడీ...పర్సనల్‌ మేకప్‌ ఆరి్టస్ట్‌తో ఓ పేజ్‌ త్రీ సోషలైట్‌ అగ్రిమెంట్‌ లాంటి కమిట్‌ మెంట్‌... 

తలపై మండుతున్న సెన్సేషన్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న షీలా అనే గృహిణిని పరీక్షించిన వైద్యులు ఆమె గతంలో చేయించుకున్న హెయిర్‌ స్ట్రెయిట్నింగ్‌ ప్రక్రియే దీనికి కారణమని నిర్ధారించారు. ఆ ప్రక్రియలో భాగంగా ఉపయోగించిన క్రీమ్‌లో గ్లైక్సిలిక్‌ యాసిడ్‌ ఆమె చర్మంలో చేరుకుని అక్కడ నుంచి మూత్రాశయాన్ని సైతం దెబ్బతీసిందని తేల్చారు.  

అధికంగా హెయిర్‌ డై వాడితే అందులో ఉండే హైడ్రోజన్‌ పెరాక్సైడ్, పీపీడీ తదితర హానికారకాల వల్ల జుట్టు ఊడిపోవడంతో మొదలుపెట్టి అస్తమా, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటిప్రాణాంతక వ్యాధులు సైతం రావచ్చని డెర్మటాలజిస్ట్‌ డా.గీతా ఒబెరాయ్‌ చెబుతున్నారు.  

బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి అవయవాలపైనా, పురుషుల్లో వీర్యోత్పత్తిపైనా దుష్ప్రభావం పడవచ్చని, అలాగే  ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి బ్రీతింగ్‌ సమస్యల వరకూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

ఈ తరహా వస్త్రధారణ వల్ల మెరాల్జియా పెరాస్తటికా అనే నరాల వ్యాధి వస్తుందని కెనడియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌ జర్నల్‌ నిర్ధారించింది. అదే విధంగా జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ, న్యూరోసర్జరీ అండ్‌ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనంలో టైట్‌ జీన్స్‌ వల్ల కంపార్ట్‌మెంట్‌ సిండ్రోమ్‌ అనే సరిస్థితి, దీనితో శరీర కదలికల సమస్యలు రావచ్చని స్పష్టం చేసింది.

లిప్‌స్టిక్‌ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే డీహైడ్రేషన్‌ సహా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లిప్‌స్టిక్‌లో వినియోగించే సర్వసాధారణ రసాయనం ట్రైక్లోజన్‌ వల్ల హృద్రోగ సమస్యలు రావచ్చని కాలిఫోరి్నయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం నిర్ధారించింది.

హైహీల్స్‌ షూస్‌ వినియోగం.. మహిళల్లో బోన్‌ హెల్త్‌పై దుష్ప్రభావం చూపుతోందని, శాశ్వత బ్యాక్‌పెయిన్‌కి, ఆస్టియోపొరోసిస్‌కి కారణమవుతోంది. ముఖ్యంగా 20–45ఏళ్ల మధ్య వయస్కులపై నిర్వహించిన మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ అధ్యయనం తేలి్చంది.

యువి నెయిల్‌ పాలిష్‌ డ్రయ్యర్స్‌ వినియోగం వల్ల కేన్సర్ల ప్రమాదం పొంచి ఉందని నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.  

నెయిల్‌ పాలిషితో పాటు షాంపూల్లోని కొన్ని రసాయనాలు 63 శాతం మహిళల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచుతాయని ఎండోక్రైన్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం నిర్ధారించింది. హెయిర్‌ స్ప్రే, ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్స్‌లో ఉండే హానికారకాలు చర్మం ద్వారా ప్రయాణించి కాలేయాన్ని, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు చెడు చేస్తాయని స్పష్టం చేసింది.

రంగుల టాటూ... రోగాల కాటు.. 
తప్పనిసరిగా స్పెషలిస్ట్‌ దగ్గరకు మాత్రమే టాటూస్‌ కోసం వెళ్లాలి. సరైన ఆరి్టస్ట్‌ కాకపోతే అతను రిపీటెడ్‌ నాన్‌స్టెరిలైజ్డ్‌ నీడిల్స్‌ వాడితే... హెపటైటిస్‌ నుంచి ఎయిడ్స్‌ వరకూ అన్నిరకాల వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకునే ముందు మన చర్మ ఆరోగ్యం గురించి డాక్టర్‌ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. టాటూస్‌ వేసుకున్నాక కనీసం రెండు వారాల పాటు పర్యవేక్షణ అవసరం.

రంగు పడుద్దా? లేదా? 
హెయిర్‌ డై/కలర్స్, షాంపూలు, కండిషనర్లు... వంటివి ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు అన్నీ కెమికల్స్‌ మేళవించినవే. వీటి విచ్చలవిడి వినియోగం వల్ల తల ఉపరితల భాగంపై చర్మంతో పాటు విభిన్న రకాల కేన్సర్లకూ ఆస్కారం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ కలర్స్‌లో అత్యధిక శాతం హానికారకాలేనని స్పష్టం చేస్తున్నారు. వీటిని వినియోగించే సమయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి... అలాగే లక్షల్లో ఖర్చుపెట్టి చేయించుకుంటున్న హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌... వంటివి విజయవంతం కావాలంటే తప్పనిసరిగా పూర్తి స్థాయి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. లేదంటే కొత్త సమస్యలు తప్పవు.  

బ్యాండ్‌ బాజా... మెమొరీ లేజా... 
ఇప్పుడు హెడ్‌ బ్యాండ్స్‌ వాడకం భారీగానే పెరిగింది. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది. అంతేకాదు మెమొరీ ప్రాబ్లెమ్స్‌ కూడా రావచ్చని పలువురు నిపుణులు చెబుతున్న మాట.  

బొట్టు.. జాగ్రత్తగా పెట్టు... 
నుదుటన బొట్టు.. స్టిక్కర్లలోకి మారిపోయి చాలా కాలమైంది. అయితే వీటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని రకాల స్టిక్కర్స్‌తో పాటు సింధూర్స్‌ కూడా అలర్జీలను కలిగిస్తాయి. వీలైనంత వరకూ న్యాచురల్, ఆర్గానిక్‌వి వాడడం మంచిది.

పియర్సింగ్‌.. సమ్‌థింగ్‌ రాంగ్‌...
కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు ఇటీవలో శరీరంలోని అనేక చోట్ల బాడీ పియర్సింగ్‌ను ఇష్టపడుతున్నారు. చెవిపోగుల నుంచి మొదలై ఇప్పుడు వంటి మీద ఎక్కడ పడితే అక్కడ రకరకాల పరికరాలను అతికించుకుంటున్నారు. ఆఖరికి నాలుక మీద కూడా రింగుల్ని గుచ్చుకుంటున్నారు. అయితే ఈ పిచ్చి ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఒకటికి మించి చెవి చుట్టూ కుట్టించుకోవడం. ముఖ్యంగా నాలుక, పెదవి, నాభి వంటి ప్రాంతాల్లోనూ పియర్సింగ్‌ చేయించుకోవడం, అవేమో ఇమిటేషన్‌ జ్యుయలరీ కావడం వల్ల స్కిన్‌ అలెర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలోని సున్నితమైన భాగాలపై జ్యుయలరీ యాడ్‌ చేయడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తీవ్రమైన ఫ్యాషన్స్‌ అనుసరించడం అంటే ఒక సైకలాజికల్‌ సమస్యగా గుర్తించాలని చెబుతున్నారు. దీన్ని అదుపు చేయకపోతే ఇది ట్రాక్షన్‌ అలోపేసియాకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.  

మితిమీరితే అనర్ధాలే... 
దాదాపు అన్ని హెయిర్‌ డైలలో ఉండే పీపీడీ చాలా హానికరం.. దీర్ఘకాలం పాటు  వినియోగిస్తే జుట్టు రాలడంతో మొదలై కేన్సర్ల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొంత మందికి దీని రియాక్షన్‌ వెంటనే తెలుస్తుంది. మరికొంత మందికి చాలా కాలం తర్వాతే బయటపడతాయి. దీనికి బదులు గోరింటాకు, హెన్నా వంటివాటితో ప్యూర్‌ బ్లాక్‌ కాకపోయినా, బ్రౌన్‌ కలర్‌ వచ్చేలా చేయవచ్చు. హెయిర్‌ స్ట్రయిటనింగ్‌ ఇప్పుడు బాగా చేయించుకుంటున్నారు. సాఫ్ట్‌నెస్‌ కోసం నప్పని రసాయనాలు ఉపయోగిస్తారు. కొన్ని క్రీమ్స్‌... వల్ల తెల్లగా అయ్యాం  అనుకుంటారు గానీ... అవి చర్మం తాలూకు పొరల్ని దెబ్బతీస్తాయి. హానికారక బాక్టీరియాను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మేకప్‌ వల్ల చర్మం పొడిబారిపోయే చాన్స్‌ ఉంది.  క్లెన్సర్‌తో శుభ్రపరచకపోతే ఆయిల్‌ బయటకు పోక కురుపులు తయారవుతాయి. పియర్సింగ్‌ సున్నితమైన అవయవాలపైన చేయించుకోకూడదు. అలాగే టాటూ ఆరి్టస్ట్స్‌తో చేయించుకుంటే ఇన్ఫెక్షన్లకు అవకాశాలు ఉంటాయి.  
–డా.డబ్లు్య.జాన్, డెర్మటాలజిస్ట్‌

మేకప్‌... ఆరోగ్యానికి పేకప్‌...
నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేస్తామని ప్రకటించే మేకప్‌ ఉత్పత్తుల్లో పరిమితికి మించిన రసాయనాలు వాడుతున్నారంటూ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్స్‌ ఉత్పత్తులను సీజ్‌ చేయడం దీనికి ఓ ఉదాహరణ.

ఫ్యాబ్రిక్‌... నప్పకపోతే..తిప్పలే...
రకరకాల ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన డ్రెస్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఫ్యాషన్‌లో ముందుండాలని పోటీపడుతున్న యువత అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా ఏది కొత్తగా వస్తే దాన్ని వాడేస్తోంది.

లిప్స్‌కి లాస్‌..
ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్‌ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమైంది. లిప్‌స్టిక్‌ పేరుతో అధరాలను మెరిపించేందుకు ప్రయతి్నంచే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్‌ లేకుండా ఏ లిప్‌స్టిక్‌ తయారయ్యే ప్రసక్తే లేదు కాబట్టి వీటిని తప్పనిసరైతే తప్ప వాడకూడదంటున్నారు. దీని బదులు కొత్తిమీర ఆకులతో, బీట్‌రూట్‌ వంటివి ఉపయోగించి పెదాల్ని ఎర్రగా మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

డ్రెస్‌ టూ డ్రగ్స్‌.. మానసిక ఒత్తిడి తప్పదు...
ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం అది కూడా ఫ్యాషన్‌ను ఫాలో అవడం ద్వారా అనేది తొలి దశలో బాగానే ఉన్నా రానురానూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. అలాగే అప్‌ టు డేట్‌గా కనపడాలనే ఆతృత చదువు, వృత్తి, ఉద్యోగాలు వంటి ఇతర ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించనివ్వదు. అలాగే ఆరోగ్యకరమైన ఫ్యాషన్లను దాటిపోయి అనారోగ్యకరమైన అలవాట్లకు ఇది దారి తీస్తుంది.

 ఆర్థిక పరమైన సమస్యలు కూడా తోడవుతాయి.. కాబట్టి ఫ్యాషన్‌ ప్రియత్వం అనేది నియంత్రణలో ఉండేలా చూసుకోవడం అత్యవసరం. లేకపోతే ఇది డ్రెస్సులతో మొదలై డ్రగ్స్‌ దాకా చేర్చినా ఆశ్చర్యం లేదు. ఈ ఫ్యాషన్ల పిచ్చిలో ఉన్న యువతను ఇతర ఆరోగ్యకరమైన వ్యాపకాలకు అంటే ఆటల వంటి అభిరుచుల వైపు మళ్లించడం మంచిది.  
– డా.జె మయూర్‌నాథ్‌రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్, సైక్రియాట్రిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement