బాధిత విద్యార్థి రుషేంద్ర, చెవి వద్ద గాయంతో విద్యార్థి..
నందిపేట్ (ఆర్మూర్): సీసీ కెమెరాను పట్టుకున్నాడని విద్యార్థిని ఉపాధ్యాయులు విచక్షణా రహితంగా కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్‌పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగింది. మండలంలోని జీజీ నడుకుడా గ్రామానికి చెందిన రుషేంద్ర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ సీసీ కెమెరాని ముట్టుకున్నాడు.
విషయం తెలుసుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు శంకర్, నరేశ్ విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రుషేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. మరుసటిరోజు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థిని గురుకులం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చెవి కర్ణభేరి దెబ్బతిన్నదని, వినికిడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాలలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గురుకుల ఆర్‌సీవో సత్యనాథ్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విచారించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, గణితం ఉపాధ్యాయుడు శంకర్‌ను విధుల నుంచి తొలగించామని, మరో ఉపాధ్యాయుడైన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. దీంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment