మండలి చైర్మన్ పదవికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి. చిత్రంలో మహమూద్ అలీ, కడియం, జగదీశ్‌రెడ్డి, వేముల, సత్యవతి తదితరులు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ పదవికి మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి అసెంబ్లీ సెక్రటేరియట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. గుత్తా వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, గొంగిడి సునీత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నామినేషన్ పత్రాలు సమర్పించాక గుత్తా మాట్లాడుతూ.. రెండోసారి మండలి చైర్మన్‌గా అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలి చైర్మన్‌గా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.
డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్?
మండలి చైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం జరిగే మండలి భేటీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తర్వాత గుత్తాకు కొత్త చైర్మన్‌గా ప్రొటెమ్ చైర్మన్ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ బాధ్యతలు అప్పగిస్తారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొత్త చైర్మన్ సోమవారం షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. సోమవారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసి మంగళవారం జరిగే మండలి భేటీలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment