జింఖానా క్లబ్ పార్కింగ్‌లో కాలిపోతున్న ఖరీదైన కార్లు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని హైదరాబాద్ జింఖానా క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పార్కింగ్ స్థలంలో ఖరీదైన కార్లు దగ్ధమయ్యాయని బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదుతో జూబీహిల్స్ పోలీసులు జింఖానా క్లబ్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించారు.
శుక్రవారం సాయంత్రం క్లబ్ పార్కింగ్ స్థలంలో ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ కారుకు అటూ ఇటూ రేంజ్‌రోవర్, కియా, మహీంద్రాథార్ కార్లు పార్కింగ్‌చేసి ఉన్నాయి. కారు అంటుకుందని క్లబ్ వ్యాలెట్ సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యంతో ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటికే మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఒక కారును సకాలంలో బయటికి తీసి ఉంటే చుట్టూ ఉన్న మరో రెండు కార్లను బయటికి తీసుకురావడానికి అవకాశం ఉండేదని అలా కాకుండా తీవ్ర జాప్యం చేయడంతో నాలుగు కార్లు కాలిపోయాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కనీసం పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకుండాపోయాయని మంటలను ఆర్పే పరికరాలు కూడా అక్కడ సిద్ధంగా లేవని గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment