సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ షీ టీమ్‌కు 256 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా వాట్సాప్ ద్వారా 214 ఫిర్యాదులు అందగా.. భౌతికంగా 22, ట్విట్టర్ ద్వారా 3, హ్యాక్ ఐలో 8, ఈ–మెయిల్ ద్వారా 2, హెచ్‌ఓడీ ద్వారా ఏడు ఫిర్యా దులు వచ్చాయి. 55 ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. వీటిల్లో 14 క్రిమినల్ కేసులు, 41 పెట్టీ కేసులున్నాయి.
ఫోన్ వేధింపులే ఎక్కువ..
సామాజిక మాధ్యమాల ద్వారా లేదా తెలిసిన వ్యక్తుల ద్వారా మహిళల నెంబర్లను సేకరించి ఫోన్‌లో వేధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ పరిధిలో 103 ఫిర్యాదులు ఈ తరహావే ఉండటం గమనార్హం. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటనలో 17 ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వేధింపులు 32, వెంబడిస్తూ వేధించే కేసులు 22, అసభ్య ప్రవర్తన 11, బ్లాక్‌మెయిలింగ్ 25 కేసులు వంటి ఫిర్యాదులున్నాయి. మహిళలను వేధిస్తున్న పోకిరీలలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండు నెలల్లో పట్టుబడిన 144 మంది ఆకతాయిలలో 53 మంది మైనర్లే ఉండటం గమనార్హం. 52 మంది 19–24 మధ్య వయస్సున్న వాళ్లు, 34 మంది 25–35 ఏళ్లు, 5 మంది 36–50 ఏళ్ల వయసు ఉన్నవాళ్లున్నారు.
ఫోన్‌లో వార్నింగ్..
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో సైబరాబాద్ పరిధిలోని బస్ స్టాప్‌లు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ట్యుటోరియల్స్, కాలేజీ వంటి పలు ప్రాంతాలలో 975 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 70 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా.. వీటిల్లో 44 పెట్టీ కేసులు బుక్ చేశారు. మిగిలిన పోకిరీలను కౌన్సిలింగ్‌కు పంపించారు. గడిచిన రెండు నెలల్లో 622 అవగాహన సదస్సులు నిర్వహించగా.. 8,851 మంది పాల్గొన్నారు. 112 మంది పోకిరీలకు ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment