ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న మంత్రి హరీశ్‌రావు
లక్డీకాపూల్: ‘రెండు రోజుల అనంతరం విపక్షాల నేతలు ఇవ్వాళ హాస్పిటల్‌కు వచ్చి హడావుడి చేస్తున్నారంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ‘ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్’బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రాత్రింబవళ్లు వాళ్లను కాపాడుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం ఘటనలో ఇన్ఫెక్షన్ సోకి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని, విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, ప్రజల ప్రాణాలు కాపాడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లల్లో ఉన్న మిగిలిన బాధితులను కూడా అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ఆస్పత్రుల వద్దే ఉంటూ బాధితుల పరిస్థితిని గంటగంటకూ పర్యవేక్షిస్తున్నారని, నిమ్స్‌లో 17 మంది, అపోలోలో 13 మంది బాధితులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందని, రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని చెప్పారు. ఆరేడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేశామని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇస్తామని మంత్రి హరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment