వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బుధవారం రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రగతిభవన్ నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా తొలివేవ్‌తో పోలిస్తే రెండో వేవ్ నాటికి రాష్ట్రంలో వైద్య సదుపాయాలను ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు.
కరోనా చికిత్స బెడ్లను 18,232 నుంచి 53,775కు, ఆక్సిజన్ బెడ్లను 9,213 నుంచి 20,738కు, ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు పెంచామని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన 27,039 బృందాలు ఇంటింటికీS తిరిగి సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. 60 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించామని, ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు.
పొరుగు రాష్ట్రాల రోగులను పరిగణనలోకి తీసుకోవాలి...
తెలంగాణ మెడికల్ హబ్ కావడంతో చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి చికిత్స పొందుతుండటంతో కోవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తోందని హరీశ్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులకు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా కేసులను కలుపుకొని బెడ్ల సంఖ్య ఆధారంగా ఆక్సిజన్, మందులు, ఇతర కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మందుల కొరత పెరగడానికి లెక్కల్లో ఈ తేడాలే ప్రధాన కారణమన్నారు. ఆక్సిజన్ కేటాయింపులను 450 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు.
ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా, దగ్గరలోని ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. కేసీఆర్ ఇప్పటికే కోరిన విధంగా 20 వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. టోసిలీ జుమాబ్ ఇంజెక్షన్లను 810 నుంచి 1,500కు పెంచాలని, రోజుకు 2లక్షల టెస్టింగ్ కిట్లను సరఫరా చేయాలని కోరారు. మొదటి డోస్ కోసం 96 లక్షల వ్యాక్సిన్లు, రెండో డోస్ పూర్తికి 33 లక్షల వ్యాక్సిన్లు కలిపి మొత్తం కోటి 29 లక్షల వ్యాక్సిన్లు అవసరమని తెలిపారు. ఈనెలాఖరులోగా 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 3 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కలిపి మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణంగా కావాలని, ఈ మేరకు రాష్ట్రానికి సరఫరా చేయాలన్నారు. 2వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి కావాలని, తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment