
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శలు సంధించారు. వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారంటూ మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ వేములవాడలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉదయం ఆయన మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌తో కలిసి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. కానీ, కేసీఆర్ వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఇక.. మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారాయన. అలాగే.. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు.
పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా?. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు గురించి ప్రస్తావిస్తూ.. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడినే గెలిపించాలని, కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని వేములవాడవాసులను కోరారాయన.
Comments
Please login to add a commentAdd a comment