సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆరోగ్య రంగంలో విభిన్న రకాల సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన అంకుర పరిశ్రమలకు దేశ, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా నగరంలో ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు ఆదరణ విశేషంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత అయిదేళ్లుగా వీటి ఏర్పాటు పరంపరం కొనసాగగా.. ఇటీవలి కాలంలో వీటికి మరింత క్రేజ్ పెరగడం విశేషం. దేశంలో హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో వీటికి ఆదరణ అత్యధికంగా ఉన్నట్లు స్టాన్‌ప్లస్ సంస్థ చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. ఇటీవల అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన స్టాన్‌ప్లస్ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడులను హెల్త్‌క్వాడ్, కళారీ క్యాపిటల్, హెల్త్ ఎక్స్ క్యాపిటల్ సంస్థల నుంచి ఆకర్షించడం విశేషం.
ఈ పెట్టుబడులతో ఈ సంస్థ పలు మెట్రో నగరాల్లో 200 వరకు రెడ్ అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ సంస్థ హైదరాబాద్, బెంగళూరు, రాయ్‌పూర్, కోల్‌కతా, కాన్పూర్ నగరాలకే పరిమితం కాగా.. మరో ఏడాదిలోగా చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్ సహా పలు నగరాల్లో సేవలందించేందుకు సన్నద్ధమవుతుండడం విశేషం. ఈ స్టార్టప్‌లు ప్రధానంగా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం 50 ఆస్పత్రులకు మాత్రమే సేవలందిస్తోన్న ఈ సంస్థ మరో 18 నెలల్లో దేశవ్యాప్తంగా 500 ఆస్పత్రుల పరిధిలో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. (క్లిక్: హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై)
హెల్త్.. వెల్త్...
ఐటీ, బీపీఓ, కెపీఓ రంగాలకు నిలయంగా మారిన గ్రేటర్ సిటీ.. వైద్యసేవల విషయంలోనూ మెడికల్ హబ్‌గా మారింది. లండన్, అమెరికాలతో పోలిస్తే నగరంలో పలు అత్యవసర శస్త్ర చికిత్సలకయ్యే వ్యయం మధ్యతరగతి, వేతన వర్గాలకు అందుబాటులో ఉంది. దీంతో ఇటీవలి కాలంలో మెడికల్ టూరిజానికి కూడా నగరం ప్రసిద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో అత్యవసర వైద్యసేవలు, టెలీమెడిసిన్, డయాగ్నోస్టిక్స్ సేవలు సహా ప్రాణాధార ఔషధాలను ఇంటి గుమ్మం వద్దకు చేర్చే సంస్థలు,అంబులెన్స్, ట్రామాకేర్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో విభిన్న రకాల సేవలందించే అంకుర పరిశ్రమలకు ఆదరణ పెరగడంతోపాటు ఆయా సంస్థలను నెలకొల్పిన వారికి ఆర్థిక చేయూత నందించేందుకు దేశ, విదేశాలకు చెందిన పలు బహుళజాతి కంపెనీలు ముందుకొస్తుండడం విశేషమని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment