
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది.
రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది. విపత్తుస్పందనా దళం, బల్దియా, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సులేమాన్ నగర్‌లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది.
చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా!