
సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా వరుసగా ఐదు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట,పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, గౌలిపుర, చార్మినార్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులను స్వీకరించి.. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.
నిండుకుండలా హిమాయత్ సాగర్
భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఏ క్షణంలోనైనా డ్యామ్ గేట్లు ఎత్తేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ 1762 అడుగులకు చేరింది. 1763 అడుగులు దాటితే గేట్లు ఎత్తేసామని హైదరాబాద్ మెట్రో పాలిటస్ వాటర్ సప్లై జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. తోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
2010లో చివరి సారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.మళ్లీ పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. డ్యామ్ గేట్ల దగ్గర లీకేజీ అవుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారు సిబ్బంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను జలమండలి, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు.
పోలీస్ శాఖ అప్రమత్తం
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్ 100కు ఫొన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు.
పెరుగుతున్న తమ్మిలేరు వరద ప్రవాహాం
భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఏలూరుకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతాలకు తమ్మిలేరు వదర నీరు వచ్చి చేరింది. తమ్మిలేరు కాలువకు గండి కొట్టి 10000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికొట్టిన ప్రాంతాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రమణారెడ్డి పరిశీలించారు. ఏలూరులో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమణారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులను సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment