నేటి మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు
నేటి అర్ధరాత్రి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం
రేపు ఉదయం బిటర్కనికా–దమర వద్ద తీరం దాటే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది. ప్రస్తుతం పారాదీప్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ., దమరకు 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో పూరీ–సాగర్ ద్వీపం మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది.
శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని బిటర్క నికా–దమర వద్ద తీరం దాటే సూచనలు కనిపి స్తున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా బలపడటంతో తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో ఉధృత గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు.
అదేవిధంగా గురువారం మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందనీ.. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవరూ 25వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment