దంచికొట్టిన వాన | Heavy Rains In Hyderabad Vehicles Wade Through Waterlogged Areas | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన

Published Sat, Jul 23 2022 8:00 AM | Last Updated on Sat, Jul 23 2022 8:10 AM

Heavy Rains In Hyderabad Vehicles Wade Through Waterlogged Areas - Sakshi

వరద నీటితో నిండిపోతున్న నిజాంపేట్‌ ప్రాంతంలోని కాలనీలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. సాధారణ జనజీవనం స్తంభించింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా హఫీజ్‌పేట్‌లో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వర్షం ధాటికి విలవిల్లాడారు. వర్షబీభత్సానికి సుమారు 200కు పైగా బస్తీలు నీటమునిగాయి.

ఇళ్లలోకి చేరిన వరదనీటితో పలు బస్తీలవాసులు నరకయాతన అనుభవించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షపునీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై వంద కూడళ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.  నగరంలోని పలు చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. వీటికి ఆనుకొని ఉన్న బస్తీల వాసులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. జంటజలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో గండిపేట్‌ జలాశయానికి ఉన్న గేట్లలో రెండు గేట్లు, హిమాయత్‌సాగర్‌ ఒక గేటు తెరచి వరదనీటిని మూసీలోకి వదిలారు.

రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 8 నుంచి 22 వరకు భారీగా వర్షపునీరు నిలిచిన ఘటనలపై బల్దియా కాల్‌ సెంటర్‌కు 1456 ఫిర్యాదులందినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. ఉప్పొంగే మురుగు సమస్యలపై గురువారం జలమండలికి 500కు పైగా ఫిర్యాదులందాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.   

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. గత వారం వరుసగా ఐదారు రోజులు వర్షాలు కురవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యలో రెండు మూడు రోజులు తెరిపివ్వగా..శుక్రవారం వాన దంచికొట్టింది. దీంతో మళ్లీ వాన కష్టాలు యథావిధిగా నగరవాసిని దెబ్బతీశాయి. 
 
నీటమునిగిన కాలనీలు, బస్తీలు 

  • కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. సూరారం శ్రీరాంనగర్‌ ప్రాంతం చెరువును తలపించింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షి కాలనీ ప్రాంతంలో నాలా పనులు నిలిచి పోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంగడిపేట్, స్ప్రింగ్‌ ఫీల్డ్‌ కాలనీ, జీడిమెట్ల గ్రామం మీదుగా వెళ్లకుండా కాలనీలోనే నిల్వ ఉండటంతో ప్రజలు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. నిజాంపేట బండారి లేఔట్‌ ప్రాంతంలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. అయోధ్యనగర్‌లో నాలా పరివాహక ప్రాంతం ఉండడంతో  వెంకటేశ్వరనగర్, గణేశ్‌నగర్, పాపయ్యయాదవ్‌ నగర్, కాకతీయ నగర్‌ కూరగాయల మార్కెట్, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లోకి వర్షపునీరు  చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు.

  
పలు ప్రాంతాల్లో వర్షబీభత్సం ఇలా.. 

  • బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడి బస్తీలో నడుములోతున వరదనీరు పోటెత్తింది.  
  • నిజాంపేట్‌లో వరదనీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు సహా పలు వాహనాలు నీటమునిగాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లు చెరువులను తలపించాయి. 
  • చింతల్‌ కాకతీయ నగర్‌లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇళ్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. 
  • బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, రసూల్‌ పురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. 
  •  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, మారేడ్‌పల్లి, ప్యారడైజ్, బేగంపేట్‌ ప్రాంతాల్లో వరదనీటిలో ట్రాఫిక్‌ భారంగా ముందుకు కదలింది. 
  • కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, ఆబిడ్స్, ట్రూప్‌బజార్, బషీర్‌భాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో జోరు వానకు మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. 
  • కోఠిలోని పలు దుకాణాల్లోకి చేరిన వరదనీటిని తేడేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. 
  • భారీగా వర్షపునీరు నిలిచే రహదారులపై ట్రాఫిక్‌ పోలీసులను మోహరించారు. జీహెచ్‌ఎంసీ అత్యవసర సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. మ్యాన్‌హోళ్లను తెరచి వరదనీటిని వేగంగా కిందకు పంపించారు. వరదనీటిలో ఘనవ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు
  • బాటసింగారం పండ్లమార్కెట్‌లో వర్షంధాటికి దుకాణాలన్నీ నీటమునిగాయి. బత్తాయి సహా పలు రకాల పండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి.  నీటిలో మునిగినవాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు.  
  • వర్ష విలయానికి మక్కామసీదు ఆవరణలో ఓ పాత భవనం నేలకూలింది. 
  • ఎల్‌బీనగర్‌ పరిధిలోని సహారాస్టేట్స్‌ కాలనీలో ఓ భవనం ప్రహరీ కూలి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. 


ట్రాఫిక్‌ పోలీసుల హై అలర్ట్‌.. 
భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. సిటీజన్లకు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే రహదారులపైకి రావద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన గంట తర్వాత బయటకు రావాలని సూచించారు. ఈ సూచనలను పాటించని పక్షంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పవని స్పష్టంచేశారు. 

నిండుకుండల్లా జంటజలాశయాలు.. 
నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గండిపేట్‌ జలాశయంలోకి 200 క్యూసెక్కుల వరదనీరు చేరగా రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 208 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. హిమాయత్‌సాగర్‌లోకి 100 క్యూసెక్కుల నీరు చేరగా..ఒక గేటును 0.6 ఫీట్ల మేర తెరచి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. 

కూలినచెట్లు 400 పైనే.. 
ఈ నెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల నగరంలో 419 చెట్లు కూలిన ఫిర్యాదులందినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని తొలగించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు 419 కూలిన చెట్లను తొలగించినట్లు పేర్కొంది. 
కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న నీటితో హుస్సేన్‌ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా..513.43కు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement