hussan sagar
-
దంచికొట్టిన వాన
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. సాధారణ జనజీవనం స్తంభించింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా హఫీజ్‌పేట్‌లో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వర్షం ధాటికి విలవిల్లాడారు. వర్షబీభత్సానికి సుమారు 200కు పైగా బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటితో పలు బస్తీలవాసులు నరకయాతన అనుభవించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షపునీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై వంద కూడళ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. వీటికి ఆనుకొని ఉన్న బస్తీల వాసులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. జంటజలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో గండిపేట్ జలాశయానికి ఉన్న గేట్లలో రెండు గేట్లు, హిమాయత్‌సాగర్ ఒక గేటు తెరచి వరదనీటిని మూసీలోకి వదిలారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 8 నుంచి 22 వరకు భారీగా వర్షపునీరు నిలిచిన ఘటనలపై బల్దియా కాల్ సెంటర్‌కు 1456 ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. ఉప్పొంగే మురుగు సమస్యలపై గురువారం జలమండలికి 500కు పైగా ఫిర్యాదులందాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. గత వారం వరుసగా ఐదారు రోజులు వర్షాలు కురవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యలో రెండు మూడు రోజులు తెరిపివ్వగా..శుక్రవారం వాన దంచికొట్టింది. దీంతో మళ్లీ వాన కష్టాలు యథావిధిగా నగరవాసిని దెబ్బతీశాయి. నీటమునిగిన కాలనీలు, బస్తీలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. సూరారం శ్రీరాంనగర్ ప్రాంతం చెరువును తలపించింది. జీడిమెట్ల డివిజన్ మీనాక్షి కాలనీ ప్రాంతంలో నాలా పనులు నిలిచి పోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంగడిపేట్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, జీడిమెట్ల గ్రామం మీదుగా వెళ్లకుండా కాలనీలోనే నిల్వ ఉండటంతో ప్రజలు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. నిజాంపేట బండారి లేఔట్ ప్రాంతంలో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. అయోధ్యనగర్‌లో నాలా పరివాహక ప్రాంతం ఉండడంతో వెంకటేశ్వరనగర్, గణేశ్‌నగర్, పాపయ్యయాదవ్ నగర్, కాకతీయ నగర్ కూరగాయల మార్కెట్, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షబీభత్సం ఇలా.. బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడి బస్తీలో నడుములోతున వరదనీరు పోటెత్తింది. నిజాంపేట్‌లో వరదనీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు సహా పలు వాహనాలు నీటమునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు చెరువులను తలపించాయి. చింతల్ కాకతీయ నగర్లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇళ్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, రసూల్ పురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మారేడ్‌పల్లి, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాల్లో వరదనీటిలో ట్రాఫిక్ భారంగా ముందుకు కదలింది. కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, ఆబిడ్స్, ట్రూప్‌బజార్, బషీర్‌భాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో జోరు వానకు మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. కోఠిలోని పలు దుకాణాల్లోకి చేరిన వరదనీటిని తేడేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. భారీగా వర్షపునీరు నిలిచే రహదారులపై ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. మ్యాన్‌హోళ్లను తెరచి వరదనీటిని వేగంగా కిందకు పంపించారు. వరదనీటిలో ఘనవ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బాటసింగారం పండ్లమార్కెట్లో వర్షంధాటికి దుకాణాలన్నీ నీటమునిగాయి. బత్తాయి సహా పలు రకాల పండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. నీటిలో మునిగినవాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్ష విలయానికి మక్కామసీదు ఆవరణలో ఓ పాత భవనం నేలకూలింది. ఎల్బీనగర్ పరిధిలోని సహారాస్టేట్స్ కాలనీలో ఓ భవనం ప్రహరీ కూలి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల హై అలర్ట్.. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీజన్లకు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే రహదారులపైకి రావద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన గంట తర్వాత బయటకు రావాలని సూచించారు. ఈ సూచనలను పాటించని పక్షంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవని స్పష్టంచేశారు. నిండుకుండల్లా జంటజలాశయాలు.. నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి 200 క్యూసెక్కుల వరదనీరు చేరగా రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 208 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. హిమాయత్‌సాగర్‌లోకి 100 క్యూసెక్కుల నీరు చేరగా..ఒక గేటును 0.6 ఫీట్ల మేర తెరచి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కూలినచెట్లు 400 పైనే.. ఈ నెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల నగరంలో 419 చెట్లు కూలిన ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని తొలగించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు 419 కూలిన చెట్లను తొలగించినట్లు పేర్కొంది. కూకట్పల్లి నాలా నుంచి వస్తున్న నీటితో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా..513.43కు చేరింది. -
గ్రేటర్ హైదరాబాద్: సాగర ‘గోస’ పట్టదా
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్ర క హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిని పరిరక్షించడంలో గ్రేటర్ యంత్రాంగం విఫలమైంది. సాగర్‌లో కూకట్పల్లి నాలా కలిసే ప్రాంతంలో నూతనంగా పలు నిర్మాణాలు చేపడుతున్నా.. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమౌతున్నాయంటూ ఇటీవల పలువురు పర్యావరణ వేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రెండు విభాగాలు తక్షణం..ఎఫ్టీఎల్ పరిధి పరిరక్షణ విషయంలో ఎందుకు విఫలమౌతున్నారన్న అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ కమిషనర్లు కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విషయంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ ప్రతినిధి లుబ్నాసర్వత్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా రెండున్నరేళ్ల క్రితం..హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని కోర్టు అప్పట్లో ఆదేశించినప్పటికీ జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నూతన కాంక్రీట్ నిర్మాణాలను అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. బీటీ రహదారులను సైతం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైపై మెరుగులే.. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగరమధనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలానుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని...చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు) -
గణేశ్ ఉత్సవాలపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి: హైకోర్టు
-
హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు
-
ఆరు నెలల్లో స్మారకం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడి మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి, నివాళులర్పించినట్లే హైదరాబాద్‌కు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు వచ్చిన సందర్భాల్లో తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించే సంప్రదాయం రావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మిస్తున్న స్మారకం పనులను శుక్రవారం అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. ఖర్చుకు వెనకాడకుండా దీన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లుంబినీ పార్కు సమీపంలో ఇది రూపుదిద్దుకుంటున్నందున భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మారకం మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న తీరు అక్కడి ఛాయా చిత్ర ప్రదర్శన కళ్లకు కడుతుందని చెప్పారు. రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ ఉంటుందన్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్మారక భవనం రూపుదిద్దుకుంటోందన్నారు. ఆరు నెలల్లో ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ పద్మనాభరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఆత్మహత్య
పంజగుట్ట : సీనియర్ జర్నలిస్టు, రచయిత వడ్డాలపు ప్రభాకర్ (43) హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో కుమారునితో కలిసి ఉంటున్న ఆయన శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుండి బయల్దేరి ఎనిమిదిన్నరకు సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నారు.అయితే ఆయన నేరుగా ఆఫీస్‌కు వెళ్లకపోవటం, రాత్రి రెండు గంటలు దాటినా ఇంటికి రాకపోవటంతో ఆయన కుమారుడు శిల్పి ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యాపారులు హుస్సేన్‌సాగర్‌లో ఓ గుర్తు తెలియని శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు జేబుల్లో లభించిన సెల్‌ఫోన్, గుర్తింపు కార్డు ఆధారంగా ప్రభాకర్‌ను గుర్తించారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో బాధపడుతున్నందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రభాకర్ పలు టీవీ చానళ్లతో పాటు, బస్తీ సినిమాకు మాటల రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ‘సాక్షి’దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాకర్ మరణంపై ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి సంతాపం వ్యక్తం చేశారు. నేడు స్వస్థలానికి భౌతిక కాయం గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన ప్రభాకర్ భౌతికకాయాన్ని పలువురు జర్నలిస్టులు సందర్శించి సంతా పం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. సోమవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఆయన స్వస్థలం కేసము ద్రం మండలం కల్లెడకు తరలిస్తారు. -
భర్త తలాక్ చెప్పాడని..
-
భర్త తలాక్ చెప్పాడని.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, హైదరాబాద్: తలాక్ ఇస్తానంటూ భర్త వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌లో దూకేందుకు యత్నించింది. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలోకి దూకేందుకు వెళ్తున్న ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న లేక్ పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా తలాక్ ఇస్తానంటూ తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. ఆత్మహత్యయత్నానికి యత్నించిన మహిళను నగరంలోని టోలీచౌక్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. -
‘సాగర్ దుర్గంధం భరించలేకున్నాం’
సాక్షి,హైదరాబాద్: నెక్లెస్ రోడ్డుపై వెళుతూ కారు అద్దాలు మూసుకున్నప్పటికీ హుస్సేన్‌సాగర్ నుంచి వచ్చే దుర్వాసన భరించలేనిదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మురికినీరు శుద్ధికి ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాలు కొన్ని చోట్ల పనిచేస్తున్నట్లు కనిపించడం లేదంది. గతంలో చెరువుల్లో నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో ఆ స్థితికి చెరువులను తీసుకొచ్చినప్పుడే వాటిని పరిరక్షించినట్లని తెలిపింది. జంట నగరాల్లో చెరువుల శుద్ధికి జియో ట్యూబ్ టెక్నాలజీని ఉపయోగించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది.