సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్ర క హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించడంలో గ్రేటర్ యంత్రాంగం విఫలమైంది. సాగర్‌లో కూకట్‌పల్లి నాలా కలిసే ప్రాంతంలో నూతనంగా పలు నిర్మాణాలు చేపడుతున్నా.. జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమౌతున్నాయంటూ ఇటీవల పలువురు పర్యావరణ వేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రెండు విభాగాలు తక్షణం..ఎఫ్‌టీఎల్ పరిధి పరిరక్షణ విషయంలో ఎందుకు విఫలమౌతున్నారన్న అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో హెచ్‌ఎండీఏ,జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విషయంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ ప్రతినిధి లుబ్నాసర్వత్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా రెండున్నరేళ్ల క్రితం..హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని కోర్టు అప్పట్లో ఆదేశించినప్పటికీ జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా నూతన కాంక్రీట్ నిర్మాణాలను అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. బీటీ రహదారులను సైతం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పైపై మెరుగులే..
స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగరమధనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలానుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని...చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు.
(చదవండి: తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు)
Comments
Please login to add a commentAdd a comment