లీజును రద్దు చేయొచ్చు | High Court bench on Apollo and Basavatarakam hospitals | Sakshi
Sakshi News home page

లీజును రద్దు చేయొచ్చు

Published Thu, Aug 6 2020 5:35 AM | Last Updated on Thu, Aug 6 2020 5:35 AM

High Court bench on Apollo and Basavatarakam hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని.. షరతులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల భూమి లీజును రద్దు చేయొచ్చని హైకోర్టు సూచించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అపోలో, బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని పేదలకు ఉచితంగా వైద్యం చే యాలన్న నిబంధనను ఉల్లం ఘించాయంటూ రిటైర్డ్‌ ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది.

ఈ రెండు ఆసుపత్రుల్లో పేదలెవరికీ ఉచితంగా వైద్యం చేయడం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు నివేదించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామనే విషయాన్ని వెబ్‌సైట్‌లో కూడా పేర్కొనలేదని వివరించారు. ‘ప్రైవేటు ఆసుపత్రుల తీరు దారుణంగా ఉంది. లక్షల్లో డబ్బు లు కడితేనే శవాలను ఇస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు’అని ఈ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు అపోలో, బసవతారకం ఆ సుపత్రుల యాజమాన్యాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను 13కు వాయిదా వేసింది.

అపోలో 15%, బసవతారకం 25% బెడ్లు ఇస్తామన్నాయి..
‘జూబ్లీహిల్స్‌లో అపోలో ఆసుపత్రికి ఎకరాకు రూ.8,500 చొప్పున 30 ఎకరాలను 1985లో ప్రభుత్వం విక్రయిస్తూ జీవో జారీ చేసింది. అయితే 15 శాతం బెడ్లను పేద రోగులకు కేటాయించి వారికి ఉచితంగా వైద్యం చేయాలనే షరతు పెట్టింది. ప్రభుత్వం కేటా యించిన ఈ భూమి విలువ దాదాపు రూ.1,500 కోట్లు. గత 30 ఏళ్లుగా పేదలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. ఇటు 1989లో బంజారాహిల్స్‌లో 7.35 ఎకరాలను నందమూరి బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రికి లీజు పద్ధతిలో ప్రభుత్వం కేటాయించింది. 1,000 బెడ్లతో అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఆ భూమి విలువ దాదాపు రూ.400 కోట్లు. ఆస్పత్రిలో 25 శాతం బెడ్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన ఉంది. అయినా ఎప్పుడూ పేదలకు ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు లేవు’అని పిటిషనర్‌ వ్యాజ్యంలో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement