సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్‌లేషన్ చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భార్య టి.ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాజాసింగ్‌ను 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టేయాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. రాజాసింగ్‌పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిందని గుర్తుచేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారని చెప్పారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
చదవండి: వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’.. 34 మందిపై చర్యలు!
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం..
గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారన్నారు. ప్రవక్తను రాజాసింగ్ ‘ఆకా’అనే పదంతో ఉచ్ఛరించారనడాన్ని న్యాయవాది వ్యతిరేకించారు. ఆకా అంటే పెద్ద అన్న అని అర్థమని చెప్పారు. ప్రవక్త గురించి రాజాసింగ్ తప్పుడుగా మాట్లాడినట్లు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని, అసలు ఆ వీడియోలోని వాయిస్ ఆయనది కాదన్నారు.
50 ఏళ్ల వ్యక్తి 6 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆగస్టు 22న రాజాసింగ్ మాట్లాడారని చెప్పారు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్ కుమార్ గత వారం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు నేడు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment