సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్‌లో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానెల్స్‌లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏబీఎన్(తెలుగు), మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆ ఆర్డర్‌కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.
‘‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీడియాలో కొందరు వ్యక్తులతో చర్చలు పెట్టారు. ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. మొత్తం న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ఒకస్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని అనకున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుని విచారణ కొనసాగించా. సస్పెండై, అరెస్టయిన ఒక మెజిస్ట్రేట్ ఏకంగా.. న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయని వ్యాఖ్యానించారు. గౌరవమైన పొజిషన్‌లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్, మహాటీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది’’
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో.. తొలి రెండు పేజీల్లో జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్న వ్యాఖ్యల సారాంశం.
‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయ’’ని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment