సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై 8 వారాల్లో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2018లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలపై ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీ శుక్రవారం విచారణ చేపట్టారు.
విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ఉమాదేవి వాదనలు వినిపిస్తూ పదోన్నతుల సమీక్షకు ఆరు నెలల సమయాన్ని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మహమ్మద్ అదనాన్ వాదనలు వినిపిస్తూ.. ఇంకా ఆరు మాసాలు గడువు కోరడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జూనియర్ లైన్‌మన్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు కల్పించిన పదోన్నతులన్నింటినీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించాలన్నారు.
నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి ఎనిమిది వారాల్లో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి, వైస్ చైర్మన్ ఆర్.సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో–కన్వినర్ సి.భానుప్రకాశ్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. వెంటనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment