సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు మ్యాపును, దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఈఈ రాసిన లేఖనూ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం, భారీ మర్రి చెట్టును తొలగిస్తున్నారని, దీన్ని ఆపేలా ఆదేశించాలంటూ తెలంగాణ వానరసేన సంస్థ అధ్యక్షుడు ఎన్.రామిరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ ఆలయాలను తొలగించాల్సి వస్తోందని, ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ లేఖ రాశారని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం ఈఈ లేఖను తమకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఈ ఆలయాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని నిరూపించేందుకు రింగ్ రోడ్ నిర్మాణ మ్యాప్ సమర్పించారా అంటూ నిలదీసింది. అరకొర సమాచారంతో ప్రభుత్వం నివేదిక సమర్పించిందని, వాస్తవాలను దాచిపెట్టి వాదనలు వినిపిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల సమర్పణకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆలయం, మర్రిచెట్టును తొలగించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment