పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’ | Higher Qualifications Candidates Also Applying For Anganwadi Aaya In Khammam | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’

Published Fri, Oct 1 2021 10:11 AM | Last Updated on Fri, Oct 1 2021 1:29 PM

Higher Qualifications Candidates Also Applying For Anganwadi Aaya In Khammam - Sakshi

అంగన్‌వాడీ ఆయా పోస్టుకు దరఖాస్తు చేస్తున్న యువతి (ఫైల్‌)

సత్తుపల్లి టౌన్‌ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
చదవండి: టీఆర్‌ఎస్‌ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం 

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు.

అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే..
అంగన్‌వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్‌ వచ్చి ఎంపికైనా పోస్టింగ్‌ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక

కుటుంబాన్ని వదిలి వెళ్లలేక..
నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్‌ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా.
- హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం

సొంతూరిలో ఉండొచ్చని...
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా.
- నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం 

ఏర్పాట్లు చేస్తున్నాం..
శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్‌ గౌతమ్, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం.
- ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ

శుభ పరిణామం..
ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్‌ కార్యక్రమాలు టైం టేబుల్‌ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్‌ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి.
- సీహెచ్‌ సంధ్యారాణి, ఐసీడీఎస్‌ పీడీ, ఖమ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement