సాక్షి, హైదరాబాద్: జీతం కోసం వెళ్తే అధికారులు అవమానించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గోషామహల్‌లోని హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయం వద్ద మంగళవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రవీందర్‌కు 55 శాతం కాలిన గాయాలైన విషయం తెలిసిందే.
ఆయనకు తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన చికిత్స కోసం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతదేహాన్ని ఉస్మా నియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవీందర్ భార్య సంధ్య, కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగడంతో రోజంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వేతనం కోసం వెళ్లి.. ఆందోళనకు గురై..
మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హైదరా బాద్ పాతబస్తీలోని రక్షాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ (38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తనకు జీతం రాకపోవడంతో రవీందర్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాల యానికి వెళ్లి వాకబు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు చులకనగా మాట్లాడటంతో రవీందర్ ఆవేదనకు లోనయ్యారు. ఆ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
ఆస్పత్రి వద్ద ఆందోళనతో..
పోలీసులు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా.. ఆయన భార్య, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసు అధికా రుల వేధింపులతోనే రవీందర్ ఆత్మహత్యకు పాల్ప డ్డారని ఆరోపించారు. బాధ్యులైన ఇద్దరు పోలీసుల ను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తన భర్త మృతిపై కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహా న్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం ఏమిటని, తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే సందేహాలు వస్తున్నాయని సంధ్య ఆరోపించారు.
ఆమెకు సంఘీభావంగా రక్షాపురం బస్తీవాసులు, హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరు కున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. చివరికి డీసీపీ లు సునీల్‌దత్, కిరణ్ ఖేర్, ఏసీపీ బాల గంగిరెడ్డి తదితరులు సంధ్యతో మాట్లాడి.. త్వరలో డీజీపీ వద్ద కు తీసుకెళ్లి న్యాయం చేస్తామని, పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సంధ్య ఆందోళన విరమించారు. వైద్యులు పోస్టు మార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శనివారం రక్షాపురంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఇద్దరు పోలీసులపై కేసు నమోదు
రవీందర్ ఆత్మహత్యపై భార్య సంధ్య చేసిన ఫిర్యాదు మేరకు షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య ఆరోపణల మేరకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలోని ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపారు.
రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: రాజకీయ పక్షాలు
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన రవీందర్ భార్య సంధ్యకు పలువురు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు ఆమెకు బాసటగా నిలిచారు.
♦ రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.2 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇక కేఏ పాల్ రూ.3.1 లక్షల చెక్కును సంధ్యకు అందించి ఓదార్చారు.
♦ హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. హోంగార్డులకు సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
♦ హోంగార్డు రవీందర్ మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హోంగార్డులను రెగ్యుల రైజ్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రవీందర్ మృతి.. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment