‘అర్జంట్... అర్జంట్... స్టాఫ్ నర్సులు కావలెను’ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన ప్రకటన ఇది. ‘నెలకు రూ.50 వేల జీతం, ఉచిత వసతి, కేరళ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచిత విమాన ప్రయాణం, చార్జీలు భరిస్తాం’ ఇది ప్రకటన సారాంశం. బీఎస్సీ, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సులు చదివినవారు ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు కావాలని కోరింది.
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా కాలం.. రోగుల తాకిడి కూడా బాగానే ఉంది.. కాసులను దండిగా దండుకోవచ్చనుకున్నారు.. కానీ, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేరు. తగిన వైద్యసేవలందించే పరిస్థితి లేక పడకలు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆదాయానికి భారీగా గండి పడింది. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఇప్పుడు వేధిస్తున్న ప్రధానసమస్య నర్సుల కొరత. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా సరిపడాలేరు. ఈ నేపథ్యంలో నర్సులకు ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రూ.50 వేల జీతం, ఉచిత వసతి కల్పిస్తామంటూ ప్రకటనలిస్తున్నాయి. గురువారం సర్కారు విడుదల చేసిన లెక్కల ప్రకారమే 95 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5,494 పడకలు కరోనా కోసం కేటాయించగా, అందులో 2,197 ఖాళీగా ఉన్నాయి. రోగులు భారీగా వస్తున్నా పడకలు లేవంటున్నాయి. సిబ్బంది కొరతతోనే తాము అలా చెప్పాల్సి వస్తుందని ఆసుపత్రుల పేర్కొంటున్నాయి.
వెయ్యిమంది నర్సులకు కరోనా
వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారమే దాదాపు వెయ్యి మంది నర్సులు కరోనా బారినపడ్డారు. నర్సింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రతీ పదిమంది నర్సుల్లో ముగ్గురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వంద మంది పనిచేసే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 మంది అనారోగ్యంతో ఉంటున్నారు. దీంతో వారంతా సెలవులు పెడుతున్నారు. చాలామంది భయాందోళనకు గురవుతూ తక్కువ జీతాలకు పనిచేయబోమని రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు
నర్సులు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు వేసి రప్పించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఒక గుంపుగా ఎక్కువమంది వచ్చేట్లయితే వారికోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేసేందుకూ కార్పొరేట్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అత్యంత పేరొందిన ఒక ఆసుపత్రికి చెందిన ఓ బ్రాంచిలో 40కిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. అదేస్థాయి కలిగిన మరో ఆసుపత్రికి చెందిన ఒక బ్రాంచిలో 50, మరో ప్రముఖ ఆసుపత్రికి చెందిన రెండు బ్రాంచీల్లో 160, ఇంకో కార్పొరేట్ ఆసుపత్రిలో 170కు పైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. 40కి పడకలు ఖాళీగా ఉన్న ఆసుపత్రి సరాసరి ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినా పది రోజుల్లో రూ.4 కోట్లు కోల్పోయే పరిస్థితి యాజమాన్యాలకు ఏర్పడింది. ఇలా భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం
ఇటీవల ఓ ఆసుపత్రి కేరళ నుంచి కొందరు నర్సులను ఆగమేఘాల మీద చార్టర్డ్ ఫ్లైట్‌లో తెప్పించింది. వారి అనుభవం, డిమాండ్‌ను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. అలా కొందరిని ఇటీవల రిక్రూట్ చేసుకుంది. ఇంకా కొందరు కావాలంటూ తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రూ.45 వేల వేతనం, మెడికల్ కవరేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. నర్సింగ్ కోర్సు అయిపోయి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోనివారైనా ఫర్వాలేదని ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment