సాక్షి, హైదరాబాద్: ఆ గుమ్మటం ఎత్తు 82 అడుగులు.. అంటే దాదాపు ఎనిమిది అంతస్తుల అంత.. 52 అడుగుల వ్యాసం.. వెరసి బాహుబలి డోమ్. అదీ ఒకటి కాదు.. రెండు.. రాష్ట్ర కొత్త సచివాలయంలో భాగంగా నిర్మాణమవుతున్న భారీ గుమ్మటాలు ఇవి. ఒకప్పుడు మహమ్మదీయ రాజులు తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ గుమ్మటాలు నిర్మించారు. కానీ ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్ రూపొందనుండటం ఇదే తొలిసారి అని అంచనా.
నిర్మాణ పనులు షురూ..
కొత్త సెక్రటేరియట్ భవనానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్న భారీ గుమ్మటం నిర్మాణం ప్రారంభమైంది. దీనికి సంబంధించి నిర్మా ణం లోపల ఆధారంగా నిలిచే ఇనుప చట్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో పైన అర్ధ వృత్తాకారంలోని భాగం సిద్ధమైంది. దాని దిగువన సిలిండర్ తరహాలో ఉండే భాగాన్ని తయారు చేసే పనులను మొదలుపెడుతున్నారు.
ఈ భాగం పూర్తవటానికి నెల రోజులు పడుతుందని.. తర్వాత రెండు భాగాలను భవనంపై మధ్య భాగంలో బిగించి.. దాని ఆధారంగా కాంక్రీట్ నిర్మాణాన్ని చేపడతారు. ఇలా రెండు భారీ గుమ్మటాలు నిర్మించనున్నారు. సచివాలయ భవనం డిజైన్ ప్రకారం.. మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండగా.. తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై గుమ్మటాలు ఉంటాయి. ఇవి ఒక్కోటీ 82 అడుగుల ఎత్తు ఉండనున్నాయి. ఇందులో సిలిండర్ తరహాలో ఉండే దిగువ భాగం 45 అడుగులు ఉంటుంది.
డోమ్ లోపల వీఐపీ జోన్!
ప్రధాన డోమ్‌ల లోపలి భాగాన్ని ఏ అవసరాలకు వినియోగించాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి దాన్ని స్కైలాంజ్ తరహాలో రూపొందిస్తున్నారు. విశాలమైన కిటికీలు అమర్చుతారు. అక్కడి నుంచి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోమ్‌ల ప్రాంతం వీఐపీ జోన్‌గానే ఉంటుందని, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. సీఎం ముఖ్యమైన సమావేశాలు అక్కడ నిర్వహించేలా రూపొందిస్తున్నట్టు వివరించారు.
ధవళ వర్ణంలో మిలమిలలాడేలా..
కొత్త సచివాలయ భవనం మొత్తం ధవళ వర్ణంలో మెరిసిపోనుంది. పాత భవనం స్పురించేలా మొత్తం తెలుపు రంగు వేయాలన్న ఆర్కిటెక్ట్ సూచనను ప్రభుత్వం ఆమోదించింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోమ్స్ కూడా తెలుపు రంగులోనే ఉండనున్నాయి. పెద్ద డోమ్‌కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే సిబ్బంది పైభాగం వరకు వెళ్లేలా మెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
45 అడుగుల ఎత్తు వరకు బయటి నుంచి మెట్లు నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి లోనికి వెళ్లి, డోమ్ పైభాగానికి చేరుకునేలా ద్వారం, క్యాట్ వాక్ స్టెయిర్స్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సచివాలయ నిర్మాణ పనుల్లో 2,200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ దసరా నాటికి భవనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అప్పటిలోగా ప్రధాన డోమ్ పనులు పూర్తికాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దసరా నాటికి ప్రధాన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి.. గుమ్మటం పనులకు అదనపు సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నవంబరు నాటికి డోమ్స్ పని పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు.
చారిత్రక డిజైన్‌లో.. 34 గుమ్మటాలతో..
హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతోపాటు కుతుబ్‌షాహీ టూంబ్స్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవనం గుర్తుకొస్తాయి. వీటన్నింటిలోనూ డోమ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీల జమానాలోని కట్టడాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆధునిక కాలంలో ఇలాంటి నిర్మాణాలు అరుదు. అయితే కాకతీయ–పర్షియా నిర్మాణ శైలులను మేళవించి డిజైన్ చేసిన కొత్త సచివాలయ భవనంపై గుమ్మటాలు కనువిందు చేయనున్నాయి. రెండు భారీ గుమ్మటాలు సహా మొత్తం 34 గుమ్మటాలను కొత్త సచివాలయంలో నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment