సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలు కోవిడ్ రోగులకు వాడే అత్యవసర మందులను బ్లాక్ చేస్తున్నాయి. మందుల కృత్రిమ కొరత సృష్టించి వాటి ధరలు అమాంతం పెంచేస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ వైరల్ ఔషధమైన రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొందరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లతోపాటు ఏజెన్సీలు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ భారీగా దండుకుంటున్నాయి. ఒక్కో ఇంజక్షన్‌ను అక్రమంగా రూ.40 వేలపైనే విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 13,701 మంది చికిత్స పొందుతుండగా వారిలో 3,859 మంది వెంటిలేటర్‌పై, 6,715 మంది ఆక్సిజన్‌పై, 3,127 మంది సాధారణ పడకలపై చికిత్స పొందుతున్నారు. మరో 25,453 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారిలో ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంలోపు ఉన్న వారిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో వైరస్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే వైరస్ లోడ్ భారీగా నమోదువుతోంది. అధిక వైరస్ లోడ్ కారణంగా రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనాకు ప్రత్యేక మందులంటూ ఏమీ లేకపోవడంతో వైద్యులు రెమిడెసివిర్‌ను కరోనాకు దివ్యౌషధంగా భావిస్తున్నారు. అధిక వైరస్ లోడ్‌తో బాధపడుతున్న వారికి తక్షణ ఉపశమనం కోసం ఈ ఇంజక్షన్లు వాడుతున్నారు. ఇలా ఒక్కో రోగికి 6 ఇంజక్షన్లు అవసరం అవుతుండగా ప్రస్తుతం రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఉత్పత్తి జరగకపోవడంతో సమస్య తలెత్తుతోంది.
బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి..
హైదరాబాద్‌లో హెటెరో ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లకు ఏప్రిల్‌కు ముందు వరకు దేశంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. దీంతో అప్పటివరకు ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చాయి. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ సహా తెలంగాణలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సహా సరిహద్దు రాష్ట్రాల్లో పడకలు దాదాపు నిండిపోయాయి. దీంతో ఇటీవల వారంతా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 30-40 శాతం మంది బాధితులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వారిలో చాలా మంది అధిక వైరస్ లోడ్ కారణంగా ఆస్పత్రికి చేరే లోపే కుప్పకూలుతున్నారు. తక్షణ ఉపశమనం కోసం వైద్యులు ప్రస్తుతం రెమిడెసివిర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఆక్సిజన్/వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతున్న బాధితులకే వాటిని వినియోగించగా తాజాగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితోపాటు ఆర్థిక స్థోమతగల వారు ముందుజాగ్రత్తగా ఈ ఇంజక్షన్లు కొని భద్రపరుచుకుంటుండటం కూడా కృత్రిమ కొరతకు దారితీస్తోంది.
డమ్మీ ప్రిస్కిప్షన్లతో ఫార్మసిస్ట్‌లు..
రోగుల బలహీనతను పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలతోపాటు కొందరు ఫార్మసిస్టులు, వైద్యులు ఆసరాగా చేసుకుంటున్నారు. ఫార్మసీల్లో ఉన్న మందులను బ్లాక్ చేసి బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటి ధరలను అమాంతం పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర సుమారు రూ.4,500 ఉండగా బ్లాక్‌లో రూ.10 వేలకుపైగా విక్రయించారు. అయితే కేంద్రం తాజాగా వాటిని సుమారు రూ.2,500 ధరకే విక్రయించాలని ఆదేశించడంతోపాటు విదేశీ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ రోగుల నిష్పత్తికి అనుగుణంగా తగినన్ని నిల్వలు లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రోగులకు తక్కువ ధరకే ఇంజక్షన్లు అందజేయాలనే లక్ష్యంతో ఉత్పత్తి సంస్థ రెండు రోజుల క్రితం మూసాపేటలోని తమ కార్యాలయంలో కౌంటర్ తెరిచింది. కోవిడ్ రోగి తాలూకు రిపోర్టులు, బాధితుడి ఆధార్ కార్డు, వైద్యుడు ఇచ్చే మందుల చీటీ ఆధారంగా మందులు విక్రయిస్తోంది. దీన్ని కూడా ఏజెన్సీలు వదల్లేదు. కొందరు వైద్యుల నుంచి నకిలీ చీటీలు తీసుకొచ్చి రోగులకు దక్కాల్సిన ఇంజక్షన్లను ఫార్మసిస్ట్‌లు, మెడికల్ ఏజెన్సీలు అడ్డదారుల్లో ఎత్తుకెళ్తూ ఒక్కో ఇంజక్షన్‌ను రూ.40 వేల పైనే విక్రయిస్తున్నాయి. ఫలితంగా ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి ఎండలో క్యూలలో నిలబడిన బాధితుల తరఫు బంధువుల్లో చాలామంది మాత్రం ఖాళీ చేతులతో వెనుతిరగాల్సి వస్తోంది.
కరీంనగర్‌లో 6 డోసులకు రూ. లక్షన్నర వసూలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరోనా రోగుల పరిస్థితి విషమించినప్పుడు వాడే రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కరీంనగర్‌లోనూ తీవ్ర కొరత నెలకొనడంతో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అవసరం ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉందని పట్టుబడుతుండటంతో ఇంజక్షన్ ఎక్కడ దొరికితే అక్కడ... ఎంత ధర చెబితే అంత చెల్లించి బాధితుల బంధువులు కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ చికిత్స అనుమతులున్న ఆస్పత్రులకే ఈ ఇంజక్షన్లు అందించాలని, మెడికల్ షాపుల్లో రోగులకు నేరుగా విక్రయించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్ మొత్తం మెడికల్ షాపుల ద్వారానే జరుగుతోంది. ఫలితంగా ఒక్కో ఇంజక్షన్ ధర ఏకంగా రూ. 25 వేలు పలుకుతోంది. ఒక రోగికి ఇవ్వాల్సిన 6 డోసులకు రూ.1.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో 50 ప్రైవేటు ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స కోసం అనుమతులు ఉండగా ఏ ఆస్పత్రిలోనూ రెమిడెసివిర్ ఇంజక్షన్ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ హవా కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ ధర గతంలో రూ.300-400 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.1,500కు చేరుకుంది. అడ్డగోలుగా ధరలు పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సైతం ఫీజులను పెంచి పేషెంట్లను ఆర్థికంగా దోచుకుంటున్నాయి.
ఇద్దరు హెటెరో సిబ్బంది సహా ముగ్గురు అరెస్ట్
హెటెరో సంస్థ తయారు చేస్తున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు సిబ్బందితోపాటు ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 12 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హెటెరోలో ఏరియా బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తున్న కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన షేక్ సలీం జాఫర్, ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పీర్జాదిగూడవాసి బత్తుల వెంకటేశ్‌లు రెమిడెసివర్‌కు పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకొనేందుకు రాంనగర్కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ జోన్నాల శ్రవణ్‌తో కలసి జట్టుకట్టారు. రూ. 3,400 పలికే ఒక్కో రెమిడెసివీర్ ఇంజక్షన్‌ను సాయికి ఒక్కో ఇంజక్షన్‌ను రూ.15 వేల చొప్పున ఆరు డోసులకు కలిపి రూ. 90 వేలకు విక్రయిస్తుండగా దీన్ని సాయి కోవిడ్ రోగుల బంధువులు, మెడికల్ షాపులకు రూ. 20 వేల చొప్పున ఆరు డోసులను 1.20 రూ. లక్షలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు తన బృందంతో కలసి నిందితులను అరెస్టు చేశారు.
బ్లాక్‌లో వ్యాక్సిన్ దందా: రూ.800 మందు రూ.14 వేలకు
Published Tue, Apr 20 2021 2:25 AM | Last Updated on Tue, Apr 20 2021 11:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment