hetero
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జీవో 140 నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో 140ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి ఏడాదికి రూ. 1,47,743 లీజు మొత్తాన్ని సాయిసింధూ ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. -
బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) టెక్నాలజీ, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ జీడిమెట్ల ఫార్మా క్లస్టర్లో 2023 ఏప్రిల్ నుంచి ఈ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. టీఎస్ఐఐసీ ఒక ఎకరం స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పద్ధతిన సమకూర్చింది. ఈ ఫెసిలిటీ కోసం హెటిరో గ్రూప్ రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ఇతర సంస్థలు సైతం ఆర్థిక సాయానికి ముందుకు వస్తాయని అసోసియేషన్ భావిస్తోంది. ఔషధ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులకు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్లో శిక్షణ ఇస్తారు. అలాగే బీడీఎంఏ సభ్య కంపెనీలు నూతనంగా నియమించుకున్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్ కల్పిస్తారు. ఆధునిక పరిశోధన, పరీక్షలకు కేంద్ర స్థానంగా ఇది నిలుస్తుందని బీడీఎంఏ తెలిపింది. పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఈ విధంగా సాంకేతిక, శిక్షణ కేంద్రం నెలకొల్పడం దేశంలో తొలిసారి అని పేర్కొంది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యం పెంచుకోవడానికి నాలెడ్జ్ సెంటర్‌గా కూడా పని చేస్తుందని అభిప్రాయపడింది. -
సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా!
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని బోన్లోకి ఎక్కించి జూకి తరలించారు. కాగా చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. చిరుత రాకను గమనించిన ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టింది. కాజీపల్లి అటవీప్రాంతం నుంచి చిరుత వచ్చిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
7 ఒప్పందాలు.. 769 ఎకరాలు!.. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాలకు భలే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల క్రయవిక్రయాలు రికార్డ్ స్థాయికి చేరాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే నగరంలో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో 68 ఒప్పందాల ద్వారా 1,656 ఎకరాల లావాదేవీలు జరగగా.. అత్యధికంగా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ 7 డీల్స్‌లో 769 ఎకరాల ట్రాన్సాక్షన్స్ జరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ∙గతేడాది జనవరి – సెప్టెంబర్‌లో దేశంలోని ఎనిమిది నగరాలలో కేవలం 20 ఒప్పందాల ద్వారా 925 ఎకరాల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో అత్యధిక డీల్స్ నివాస విభాగంలోనే జరిగాయి. 40 ఒప్పందాలలో 590కి పైగా ఎకరాల లావాదేవీలు నివాస సముదాయాల అభివృద్ధి కోసం జరగగా.. 4 డీల్స్‌లో 147 ఎకరాలు పారిశ్రామిక మరియు గిడ్డంగుల విభాగంలో, 4 ఒప్పందాలలో 119 ఎకరాలు డేటా సెంటర్ల ఏర్పాటు, 5 డీల్స్‌లో 115 ఎకరాలు మిక్స్డ్ డెవలప్మెంట్ కోసం, 4 ఒప్పందాలలో 26 ఎకరాలు వాణిజ్య సముదాయాల విభాగంలో, 11 డీల్స్‌లో సుమారు 659 ఎకరాల లావాదేవీలు రిటైల్, బీపీఓ వంటి అభివృద్ధి పనుల కోసం జరిగాయి. హైదరాబాద్‌లో భూమ్.. ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. 46 శాతం వాటాతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 14 శాతంతో ఎన్సీఆర్ రెండో స్థానంలో, 13 శాతం బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. ముంబైలో అత్యధిక ల్యాండ్ డీల్స్ జరిగినా.. అవి కేవలం చిన్నపాటి స్థల లావాదేవీలకే పరిమితమయ్యాయి. నగరంలో జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే.. ►ఈ ఏడాది మూడో త్త్రైమాసికంలో జీఓసీఎల్ కార్పొరేషన్ స్థల యాజమాని నుంచి స్క్వేర్‌స్పేస్ ఇన్ఫ్రా సిటీ 12.25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ సుమారు రూ.125 కోట్లు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనేది ఇంకా నిర్ణయంకాలేదు. ►ఈ ఏడాది తొలి త్త్రైమాసికంలో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో గ్రూప్ 600 ఎకరాల ►స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.350 కోట్లు. ►అలాగే క్యూ1లో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ షాద్‌నగర్‌లో రూ.164 కోట్లతో 41 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. -
హెటిరో చేతికి జాన్సన్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ హెటిరో తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఇంజెక్టేబుల్స్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటించింది. డీల్ విలువ రూ.130 కోట్లు. హైదరాబాద్ సమీపంలోని పెంజెర్ల వద్ద 55.27 ఎకరాల్లో ఈ ప్లాంటు విస్తరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెటిరో ఫ్లాగ్షిప్ స్టెరైల్ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుంది. ఈ కేంద్రంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు, మెరుగుపరచడానికి, బయోలాజిక్స్, స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీని విస్తరించడానికి సుమారు రూ.600 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ద్వారా బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులర్ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాల్లో నూతనంగా 2,000 ఉద్యోగాలను జోడించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ డీల్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా పీడబ్ల్యూసీ వ్యవహరించింది. -
యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్ ల్యాబ్ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు. మరో రూ.50 లక్షలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. స్వర్ణతాపడానికి బంగారం అందజేత యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
యాదాద్రికి ‘బంగారు’ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం హెటిరో సంస్థ చైర్మన్ పార్థసారథిరెడ్డి తన కుటుంబం తరఫున 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అలాగే, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. టీఆర్ఎస్కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, ఎం.హన్మంతరావు, ఎం.కృష్ణారావు, కేపీ వివేకానంద్ తమ కుటుంబాల తరఫున ఏడు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఏపీ నుంచి జడ్పీటీసీ.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విమాన గోపుర స్వర్ణ తాపడం పనుల కోసం కిలో బంగారాన్ని విరాళంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని పేర్కొంది. ’ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని జయమ్మ పేర్కొన్నట్టు సీఎంఓ తెలిపింది. -
కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటెరో తాజాగా టోసిలిజుమాబ్ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. కోవిడ్–19 చికిత్సలో ఈ మందును వాడతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దల్లో స్టెరాయిడ్స్ పనిచేయని, ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తారు. బయోసిమిలర్ వర్షన్ టోసిలిజుమాబ్‌ను హెటెరో అనుబంధ కంపెనీ హెటెరో హెల్త్‌కేర్ టోసిరా పేరుతో విక్రయించనుంది. 20 మిల్లీలీటర్ల వయల్ రూపంలో కంపెనీ రూపొందించింది. రోషె తయారీ యాక్టెమ్రా ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. హెటెరోకు చెందిన బయోలాజిక్స్ విభాగం హెటెరో బయోఫార్మా హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంటులో టోసిరాను ఉత్పత్తి చేస్తోంది. సెపె్టంబర్ చివరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ‘ప్రపంచవ్యాప్తంగా టోసిలిజుమాబ్ ఔషధం కొరతను పరిగణనలోకి తీసుకుంటే భార త్లో సరఫరా భద్రతకు డీసీజీఐ ఆమోదం చాలా కీలకం. నిష్పక్షపాతంగా ఔషధం పంపిణీకి ప్రభు త్వంతో కలిసి పని చేస్తాం. కంపెనీ సాంకేతిక సామర్థ్యానికి, కోవిడ్–19 ముఖ్యమైన ఔషధాలను తీసుకురావడానికి సంస్థకు ఉన్న నిబద్ధతకు తాజా అను మతి నిదర్శనం’ అని ఈ సందర్భంగా హెటెరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. -
5 రోజుల్లో కరోనాకు చెక్.. డీసీజీఏ అనుమతి కోరిన హెటిరో
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటిరో కరోనా చికిత్సలో అత్యవసర వినియోగం కింద మోలినో ఫెరివిర్ వాడకానికి శుక్రవారం డీసీజీఏ అనుమతి కోరింది. టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి రానున్న మోలినో ఫెరివిర్ 5 రోజుల్లో కరోనాను తగ్గిస్తుందని హెటిరో సంస్థ వెల్లడించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ టాబ్లెట్ వలన కొవిడ్ బాధితులు కోలుకున్నారని హెటిరో తెలిపింది. మోలినో ఫెరివిర్ అమెరికాలోని మెర్క్ షార్ప్ & డోహ్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఔషధం. ఈ ఏడాది ఏప్రిల్ లో, హెటిరో భారతదేశంలో మోలినో ఫెరివిర్ తయారీ, సరఫరా చేయడానికి మెర్క్ షార్ప్ & డోహ్మ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేజ్-3 ట్రయల్ తాత్కాలిక డేటా ప్రకారం ఈ టాబ్లెట్ వలన కోవిడ్ లక్షణాలతో తక్కవగా ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపింది. -
కరోనా ట్రీట్మెంట్కు మరో ఔషధం
-
బ్లాక్‌లో వ్యాక్సిన్ దందా: రూ.800 మందు రూ.14 వేలకు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలు కోవిడ్ రోగులకు వాడే అత్యవసర మందులను బ్లాక్ చేస్తున్నాయి. మందుల కృత్రిమ కొరత సృష్టించి వాటి ధరలు అమాంతం పెంచేస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ వైరల్ ఔషధమైన రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొందరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లతోపాటు ఏజెన్సీలు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ భారీగా దండుకుంటున్నాయి. ఒక్కో ఇంజక్షన్‌ను అక్రమంగా రూ.40 వేలపైనే విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 13,701 మంది చికిత్స పొందుతుండగా వారిలో 3,859 మంది వెంటిలేటర్‌పై, 6,715 మంది ఆక్సిజన్‌పై, 3,127 మంది సాధారణ పడకలపై చికిత్స పొందుతున్నారు. మరో 25,453 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారిలో ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంలోపు ఉన్న వారిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో వైరస్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే వైరస్ లోడ్ భారీగా నమోదువుతోంది. అధిక వైరస్ లోడ్ కారణంగా రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనాకు ప్రత్యేక మందులంటూ ఏమీ లేకపోవడంతో వైద్యులు రెమిడెసివిర్‌ను కరోనాకు దివ్యౌషధంగా భావిస్తున్నారు. అధిక వైరస్ లోడ్‌తో బాధపడుతున్న వారికి తక్షణ ఉపశమనం కోసం ఈ ఇంజక్షన్లు వాడుతున్నారు. ఇలా ఒక్కో రోగికి 6 ఇంజక్షన్లు అవసరం అవుతుండగా ప్రస్తుతం రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఉత్పత్తి జరగకపోవడంతో సమస్య తలెత్తుతోంది. బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి.. హైదరాబాద్‌లో హెటెరో ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లకు ఏప్రిల్‌కు ముందు వరకు దేశంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. దీంతో అప్పటివరకు ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చాయి. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ సహా తెలంగాణలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సహా సరిహద్దు రాష్ట్రాల్లో పడకలు దాదాపు నిండిపోయాయి. దీంతో ఇటీవల వారంతా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 30-40 శాతం మంది బాధితులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వారిలో చాలా మంది అధిక వైరస్ లోడ్ కారణంగా ఆస్పత్రికి చేరే లోపే కుప్పకూలుతున్నారు. తక్షణ ఉపశమనం కోసం వైద్యులు ప్రస్తుతం రెమిడెసివిర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఆక్సిజన్/వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతున్న బాధితులకే వాటిని వినియోగించగా తాజాగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితోపాటు ఆర్థిక స్థోమతగల వారు ముందుజాగ్రత్తగా ఈ ఇంజక్షన్లు కొని భద్రపరుచుకుంటుండటం కూడా కృత్రిమ కొరతకు దారితీస్తోంది. డమ్మీ ప్రిస్కిప్షన్లతో ఫార్మసిస్ట్‌లు.. రోగుల బలహీనతను పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలతోపాటు కొందరు ఫార్మసిస్టులు, వైద్యులు ఆసరాగా చేసుకుంటున్నారు. ఫార్మసీల్లో ఉన్న మందులను బ్లాక్ చేసి బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటి ధరలను అమాంతం పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర సుమారు రూ.4,500 ఉండగా బ్లాక్‌లో రూ.10 వేలకుపైగా విక్రయించారు. అయితే కేంద్రం తాజాగా వాటిని సుమారు రూ.2,500 ధరకే విక్రయించాలని ఆదేశించడంతోపాటు విదేశీ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ రోగుల నిష్పత్తికి అనుగుణంగా తగినన్ని నిల్వలు లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రోగులకు తక్కువ ధరకే ఇంజక్షన్లు అందజేయాలనే లక్ష్యంతో ఉత్పత్తి సంస్థ రెండు రోజుల క్రితం మూసాపేటలోని తమ కార్యాలయంలో కౌంటర్ తెరిచింది. కోవిడ్ రోగి తాలూకు రిపోర్టులు, బాధితుడి ఆధార్ కార్డు, వైద్యుడు ఇచ్చే మందుల చీటీ ఆధారంగా మందులు విక్రయిస్తోంది. దీన్ని కూడా ఏజెన్సీలు వదల్లేదు. కొందరు వైద్యుల నుంచి నకిలీ చీటీలు తీసుకొచ్చి రోగులకు దక్కాల్సిన ఇంజక్షన్లను ఫార్మసిస్ట్‌లు, మెడికల్ ఏజెన్సీలు అడ్డదారుల్లో ఎత్తుకెళ్తూ ఒక్కో ఇంజక్షన్‌ను రూ.40 వేల పైనే విక్రయిస్తున్నాయి. ఫలితంగా ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి ఎండలో క్యూలలో నిలబడిన బాధితుల తరఫు బంధువుల్లో చాలామంది మాత్రం ఖాళీ చేతులతో వెనుతిరగాల్సి వస్తోంది. కరీంనగర్లో 6 డోసులకు రూ. లక్షన్నర వసూలు! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరోనా రోగుల పరిస్థితి విషమించినప్పుడు వాడే రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కరీంనగర్లోనూ తీవ్ర కొరత నెలకొనడంతో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అవసరం ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉందని పట్టుబడుతుండటంతో ఇంజక్షన్ ఎక్కడ దొరికితే అక్కడ... ఎంత ధర చెబితే అంత చెల్లించి బాధితుల బంధువులు కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ చికిత్స అనుమతులున్న ఆస్పత్రులకే ఈ ఇంజక్షన్లు అందించాలని, మెడికల్ షాపుల్లో రోగులకు నేరుగా విక్రయించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్ మొత్తం మెడికల్ షాపుల ద్వారానే జరుగుతోంది. ఫలితంగా ఒక్కో ఇంజక్షన్ ధర ఏకంగా రూ. 25 వేలు పలుకుతోంది. ఒక రోగికి ఇవ్వాల్సిన 6 డోసులకు రూ.1.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో 50 ప్రైవేటు ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స కోసం అనుమతులు ఉండగా ఏ ఆస్పత్రిలోనూ రెమిడెసివిర్ ఇంజక్షన్ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ హవా కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ ధర గతంలో రూ.300-400 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.1,500కు చేరుకుంది. అడ్డగోలుగా ధరలు పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సైతం ఫీజులను పెంచి పేషెంట్లను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఇద్దరు హెటెరో సిబ్బంది సహా ముగ్గురు అరెస్ట్ హెటెరో సంస్థ తయారు చేస్తున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు సిబ్బందితోపాటు ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 12 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హెటెరోలో ఏరియా బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తున్న కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన షేక్ సలీం జాఫర్, ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పీర్జాదిగూడవాసి బత్తుల వెంకటేశ్‌లు రెమిడెసివర్‌కు పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకొనేందుకు రాంనగర్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ జోన్నాల శ్రవణ్‌తో కలసి జట్టుకట్టారు. రూ. 3,400 పలికే ఒక్కో రెమిడెసివీర్ ఇంజక్షన్‌ను సాయికి ఒక్కో ఇంజక్షన్‌ను రూ.15 వేల చొప్పున ఆరు డోసులకు కలిపి రూ. 90 వేలకు విక్రయిస్తుండగా దీన్ని సాయి కోవిడ్ రోగుల బంధువులు, మెడికల్ షాపులకు రూ. 20 వేల చొప్పున ఆరు డోసులను 1.20 రూ. లక్షలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు తన బృందంతో కలసి నిందితులను అరెస్టు చేశారు. -
కరోనా : మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్
న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫావిపిరవిర్ ఒక్క ట్యాబ్లెట్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివరకే కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఫావిపిరవిర్ ఔషధం క్లినికల్‌గా సానుకూల ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. (కోవిడ్-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!) ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించి డీసీజీఐ నుంచి అన్ని అనుమతులను పొందినట్టు హెటిరో వెల్లడించింది. హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా ఫావిపిరవిర్ ఔషధం మార్కెటింగ్ చేయబడుతుందని.. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ ఫార్మసీలలో.. ఈ ఔషధం నేటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే ఈ డ్రగ్‌ను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న ఎక్కువ మంది కోవిడ్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఔషధం తోడ్పతుందని పేర్కొంది. దేశంలోని తమ కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో తయారవుతున్న ఈ డ్రగ్‌కు గ్లోబల్ రెగ్యులేటరీ అధికారులు కూడా ఆమోదించారని వెల్లడించింది.(హెటిరో ‘కోవిఫర్’ ధర రూ.5,400) -
‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’
ఢిల్లీ : హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్‌డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే రెమ్‌డెసివిర్ మందుపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత రానుందని సంస్థ పేర్కొంది. తాజాగా జరిపిన విశ్లేషణలో కరోనా నుంచి కోలుకున్న 312 మంది నుంచి సమాచారం సేకరించాము. దీంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నది అధ్యయనం చేసినట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. కరోనాతో బాధపడుతున్న రోగులకు 5 నుంచి 10 రోజులు పాటు రెమ్‌డెసివిర్ మందు డోజేజ్ విధానంలో అందించారని దాని వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదని అధ్యయనంలో తేలింది..కానీ ప్లేసిబో తో రెమ్‌డెసివిర్‌ను పోల్చిచూడలేదని స్పష్టం చేసింది. (వికృత చర్య : మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది) రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో 74.4 శాతం మంది 14 రోజుల్లో కోలుకుంటున్నారని తేలింది. కాగా రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందిన రోగుల మరణాల రేటు 14 రోజుల్లో 7.6 శాతంగా ఉంటే.. అదే ఆ మందు తీసుకోనివారు మరణాల రేటు 12.5 శాతంగా ఉంది. గత ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ఇచ్చిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే రెమ్‌డెసివిర్ మందుపై ఒక స్పష్టత వస్తుందని గిలియడ్ సంస్థ పేర్కొంది.(వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!) -
హెటిరో ‘కోవిఫర్’ ధర రూ.5,400
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ హెటిరో.. కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధం ‘కోవిఫర్’ ధరను రూ.5,400గా నిర్ణయించింది. ముందుగా 20,000 వయల్స్‌ను అందించనున్నట్టు కంపెనీ బుధవారం తెలిపింది. వీటిలో 10,000 వయల్స్ హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వెంటనే సరఫరా చేస్తున్నట్టు ప్రకటించింది. మరో 10,000 వయల్స్‌ను కోల్‌కత, ఇండోర్, భోపాల్, లక్నో, పట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాల్లో వారంలో అందుబాటులో ఉంచనున్నారు. కోవిఫర్ అందుబాటులోకి రావడం గొప్ప మైలురాయిగా హెటిరో హెల్త్‌కేర్ ఎండీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి అభివర్ణించారు. ఈ ఔషధం ద్వారా రోగుల చికిత్స సమయం తగ్గి, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. కోవిఫర్ వేగంగా అందుబాటులో ఉంచేందుకై ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వైద్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. -
కోవిడ్‌కు మరో ఔషధం..
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ అనే తమ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని తెలిపింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని హైదరాబాద్ సంస్థ హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఆదివారం వెల్లడించారు. ‘కోవిఫర్’తో కోవిడ్–19 చికిత్సకు కీలక మలుపు కానుందన్నారు. రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్ ‘కోవిఫర్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కోవిఫర్ ఔషధం 100 మిల్లీగ్రాముల వయల్‌లో ప్రవేశపెడుతున్నామనీ, ఈ ఇంజెక్షన్‌ను ఆస్పత్రిలో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధర రూ.5–6 వేల మధ్య..: ఒక్కో డోస్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. ప్రస్తుతం రిటైల్‌గా దీనిని విక్రయించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారానే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు హెటిరో చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో దీనిని కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతి పొందినట్లు హెటిరో వెల్లడించింది. ఈ ఔషధానికి అమెరికాలో కోవిడ్–19 రోగులకు అత్యవసర ఉపయోగం (ఎమర్జెన్సీ యూజ్) కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చింది. కాగా, భారత్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీ సిప్లా సైతం రెమ్‌డెసివిర్ ఔషధం తయారీ, విక్రయానికి డీసీజీఐ అనుమతి పొందింది. సిప్లా ఈ ఔషధాన్ని సిప్రెమి పేరుతో ప్రవేశపెట్టనుంది. -
10 లక్షల డోసులతో సిద్ధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ 19 వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధం రెమ్డిసివిర్ సరఫరాకి సంబంధించి ఫేజ్–1లో ప్రభుత్వం ఆదేశాలొస్తే సత్వరం 10 లక్షల డోసులను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్ ఎండీ బి.వంశీకృష్ణ వెల్లడించారు. ఈ ఔషధాన్ని తయారు చేసి, విక్రయించేందుకు అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో హెటిరో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ఈ విషయం చెప్పారు. దేశీయంగా డిమాండ్ ఎంత స్థాయిలో ఉంటుందనేది కూడా ఇప్పుడే అంచనా వేయలేమని, ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఎలా ఉండబోతున్నప్పటికీ తమ వంతుగా ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు 10 లక్షల డోసులు అందించేందుకు సిద్ధమవుతున్నామని వంశీకృష్ణ చెప్పారు. లైసెన్సీలు అందరితో మాట్లాడి ఎంత మేరకు అవసరమవుతుందనేది బహుశా రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం తెలియజేయొచ్చని భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికైతే దీన్ని అందుబాటులోకి తేవడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. దేశీయంగా ఈ ఔషధం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు కాబట్టి ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రభుత్వం, ఐసీఎంఆర్, డీసీజీఐ చెప్పేదాన్ని బట్టి వినియోగం గురించి తెలుస్తుందన్నారు. త్వరలో అనుమతులు.. డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోబోతున్నామని వంశీకృష్ణ తెలియజేశారు. ‘‘ఇది అత్యవసరమైన అంశం కాబట్టి డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. అవి వచ్చాక 7–10 పనిదినాల్లో దీన్ని అందుబాటులోకి తేగలం. జూన్‌లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు’’ అని వంశీకృష్ణ వివరించారు. సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వపరమైన కొనుగోళ్ల కారణంగా దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బహుశా రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని వంశీకృష్ణ తెలిపారు. రెమ్డిసివిర్ను విశాఖ, హైదరాబాద్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, పూర్తిగా ఇండియా ఉత్పత్తిగా దీన్ని చెప్పుకోవచ్చని చెప్పారాయన. ఇతర దేశాలకూ ఎగుమతి.. ఒప్పందం ప్రకారం.. ఎగుమతి మార్కెట్లకు సంబంధించి ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు దీన్ని ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు. ఇప్పటికే వాటిల్లో చాలా దేశాలకు తాము ఇతర ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఆయా మార్కెట్లలో గిలీడ్‌కు నేరుగా కార్యకలాపాలు లేవు. అలాంటి దేశాల్లో మా ద్వారా ఈ ఔషధం అందుబాటులోకి తేవాలని ఆ సంస్థ భావిస్తోంది’’ అని చెప్పారు. -
కరోనా: హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూపు ఎండీ వంశీ కృష్ణ.. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. దీంతోపాటు కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్‌లు అందజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌కు సీఎస్ఆర్ ఫండ్స్‌తో పాటు నక్కపల్లిలో శానిటైజేషన్, మందులు, నిత్యావసర సరుకుల పంపిణీకి మరో రెండు కోట్లు అందజేశామని హెటిరో డ్రగ్స్ ప్రతినిధులు తెలిపారు. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భాగంగా దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసింది. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ బ్రహ్మనందరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెక్కును అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం నందలూరు రాయల్ మెడికల్స్ ప్రొప్రైటర్ అరిగే మని.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 100000/- లక్ష రూపాయలు పంపారు. (సీసీసీకి వైజయంతీ మూవీస్ రూ. 5 లక్షలు విరాళం) అమరావతి : కరోనా వ్యతిరేక పోరాటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని రూ. 83 లక్షల 86 వేల 747 విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు ఈ విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. (నన్నే ఆపేస్తారా.. లేదు అరెస్టు చేస్తాం! ) -
Hetero admirable social service
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత 5 వేల మంది విద్యార్థులకు స్కూలు బ్యాగులు పోలీస్ శాఖ నిర్మాణానికి సంస్థ అంగీకారం నక్కపల్లి : మండలంలో విద్య, వైద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని 23 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే సుమారు 5వేల మంది విద్యార్థులకు సోమవారం హెటోరో సంస్థ ఉచితంగా స్కూలు బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేసింది. నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ హెటెరో సంస్థతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని చేయాలని ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు సూచించారు. నక్కపల్లికి మంజూరైన సర్కిల్ పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణానికి నిధుల్లేక జాప్యం జరుగుతోందని తెలుసుకున్న హెటెరో యాజమాన్యం భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు. నక్కపల్లి ఉన్నత పాఠశాలలో శిథిల భవనాల స్థానంలో అదనపు తరగతి గదులను నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని, మండల ప్రజల వైద్య అవసరాలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంస్థతో పరస్పర సహకార ధోరణితో వ్యవహరిస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు. సంస్థ డెరక్టర్(ఫైనాన్స్) భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో కంటి వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా కంటిచూపు పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శ్రస్త్రచికిత్స చేయిస్తామని తెలిపారు. అవసరమైతే వారికి నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ పార్థసారధి రెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ఏటా యలమంచిలి డివిజన్ పరిధిలో పదోతరగతి చదువుతున్న 2వేలమంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, సంస్థ పరిసర ప్రాంత గ్రామాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నామని, పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. వేంపాడు, ఉపమాక, నక్కపల్లి గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లా ఉప విద్యాశాఖాదికారి లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెటెరో సంస్థ దయతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీసం వెంకటలక్ష్మి, తహశీల్దార్ జగన్నాథరావు, ఎంపీడీవో కృష్ణ, ఎంఈవో ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు నూకరాజు, డీజీఎం గోపాలకృష్ణారెడ్డి, ప్రతినిధులు మురళి, రజనీకాంత్, సుబ్బారెడ్డి,పార్థసారధి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.