
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ అనే తమ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని తెలిపింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని హైదరాబాద్ సంస్థ హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఆదివారం వెల్లడించారు. ‘కోవిఫర్’తో కోవిడ్–19 చికిత్సకు కీలక మలుపు కానుందన్నారు. రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్ ‘కోవిఫర్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కోవిఫర్ ఔషధం 100 మిల్లీగ్రాముల వయల్‌లో ప్రవేశపెడుతున్నామనీ, ఈ ఇంజెక్షన్‌ను ఆస్పత్రిలో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ధర రూ.5–6 వేల మధ్య..: ఒక్కో డోస్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. ప్రస్తుతం రిటైల్‌గా దీనిని విక్రయించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారానే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు హెటిరో చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో దీనిని కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతి పొందినట్లు హెటిరో వెల్లడించింది. ఈ ఔషధానికి అమెరికాలో కోవిడ్–19 రోగులకు అత్యవసర ఉపయోగం (ఎమర్జెన్సీ యూజ్) కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. కాగా, భారత్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీ సిప్లా సైతం రెమ్‌డెసివిర్ ఔషధం తయారీ, విక్రయానికి డీసీజీఐ అనుమతి పొందింది. సిప్లా ఈ ఔషధాన్ని సిప్రెమి పేరుతో ప్రవేశపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment