
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని బోన్‌లోకి ఎక్కించి జూకి తరలించారు. కాగా చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. చిరుత రాకను గమనించిన ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టింది. కాజీపల్లి అటవీప్రాంతం నుంచి చిరుత వచ్చిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.