చిరుత చెక్కేసింది..
బెంగళూరులోని ఓ పాఠశాలలోకి చొరబడి.. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన చిరుతపులి మళ్లీ తప్పించుకుంది. ఈ నెల 8న చిరుతపులి ఓ పాఠశాలలకు చొరబడి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అది ఎనిమిది మందిపై దాడి కూడా చేసింది. నాటకీయ పరిణామాల నడుమ దానికి మత్తుమందు ఇచ్చి అత్యంత చాకచక్యంగా బంధించిన సంగతి తెలిసిందే. బంధించిన అనంతరం ఈ చిరుతను తీసుకెళ్లి బన్నెర్‌ఘట్ట జాతీయ పార్కులో ఓ బోను ఉంచారు. అయితే ఆదివారం రాత్రి చిరుతకు ఆహారం పెట్టేందుకు నిర్వాహకులు బోను తలుపులు తెరిచారు. ఆ తర్వాత సరిగ్గా తలుపులు మూయకపోవడం వల్ల చిరుత తప్పించుకొని ఉంటుందని భావిస్తున్నారు.
అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పార్కు పరిసరాలను దాటి చిరుత బయటకు వెళ్లలేదని, ఇది చిరుతకు సహజ ఆవాసమని పార్కు డైరెక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. అయితే మరికొన్ని రోజులు పంజరంలో ఉంచి ఆ తర్వాత దానిని ఈ పార్కులో వదిలేయాలని భావించామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు 52 మంది అటవీ అధికారులతో ఆరు బృందాలను పార్కులో రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.