సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల క్రయవిక్రయాలు రికార్డ్ స్థాయికి చేరాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే నగరంలో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో 68 ఒప్పందాల ద్వారా 1,656 ఎకరాల లావాదేవీలు జరగగా.. అత్యధికంగా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ 7 డీల్స్‌లో 769 ఎకరాల ట్రాన్సాక్షన్స్ జరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
∙గతేడాది జనవరి – సెప్టెంబర్‌లో దేశంలోని ఎనిమిది నగరాలలో కేవలం 20 ఒప్పందాల ద్వారా 925 ఎకరాల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో అత్యధిక డీల్స్ నివాస విభాగంలోనే జరిగాయి. 40 ఒప్పందాలలో 590కి పైగా ఎకరాల లావాదేవీలు నివాస సముదాయాల అభివృద్ధి కోసం జరగగా.. 4 డీల్స్‌లో 147 ఎకరాలు పారిశ్రామిక మరియు గిడ్డంగుల విభాగంలో, 4 ఒప్పందాలలో 119 ఎకరాలు డేటా సెంటర్ల ఏర్పాటు, 5 డీల్స్‌లో 115 ఎకరాలు మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ కోసం, 4 ఒప్పందాలలో 26 ఎకరాలు వాణిజ్య సముదాయాల విభాగంలో, 11 డీల్స్‌లో సుమారు 659 ఎకరాల లావాదేవీలు రిటైల్, బీపీఓ వంటి అభివృద్ధి పనుల కోసం జరిగాయి.
హైదరాబాద్‌లో భూమ్..
ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. 46 శాతం వాటాతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 14 శాతంతో ఎన్‌సీఆర్ రెండో స్థానంలో, 13 శాతం బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. ముంబైలో అత్యధిక ల్యాండ్ డీల్స్ జరిగినా.. అవి కేవలం చిన్నపాటి స్థల లావాదేవీలకే పరిమితమయ్యాయి.
నగరంలో జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే..
►ఈ ఏడాది మూడో త్త్రైమాసికంలో జీఓసీఎల్ కార్పొరేషన్ స్థల యాజమాని నుంచి స్క్వేర్‌స్పేస్ ఇన్‌ఫ్రా సిటీ 12.25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ సుమారు రూ.125 కోట్లు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనేది ఇంకా నిర్ణయంకాలేదు.
►ఈ ఏడాది తొలి త్త్రైమాసికంలో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో గ్రూప్ 600 ఎకరాల
►స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.350 కోట్లు.
►అలాగే క్యూ1లో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ షాద్‌నగర్‌లో రూ.164 కోట్లతో 41 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment