ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో పాటు ప్రధాన పార్టీలకు ప్రతి ష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై కోట్ల మొత్తంలో పందేలు కాస్తున్నారు. రెండు పార్టీల నాయకులతో పాటు భారీ స్థాయిలో కమీషన్ దండుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. హుజూరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాం తాల్లోనే రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే ఫలితంపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
ఈటల.. కాదు గెల్లు
రాజకీయ నాయకులు, పార్టీలు, గెలుపు, మెజారిటీ.. ఇలా నాలుగు రకాల బెట్టింగ్‌లకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు తెరలేపారు. ఈటల గెలుస్తాడని లేదు గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని రెండు పార్టీలుగా విడిపోయిన నాయకులు అభ్యర్థులపై రూ.10 లక్షలు చొప్పున బెట్టింగ్‌లు పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం భారీ స్థాయిలో బెట్టింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని మరో పార్టీకి చెందిన నాయకులు రూ.3 కోట్లు పోటీ బెట్టింగ్ కాశారు.
మెజారిటీపై బెట్టింగ్..
ఈటల గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్న ఆయన అభిమానులు ఈ మేరకు భారీ స్థాయిలో పందేలు కాసినట్టు తెలిసింది. 35 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలుస్తారని కొందరు బెట్టింగ్ కాయగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 25 వేల మెజారిటీతో గెలుస్తాడని టీఆర్‌ఎస్ నేతలు పోటీ బెట్టింగ్ కాసినట్టు హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. మెజారిటీపై ఒక్క హుజూరాబాద్‌లోనే రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి.
ఎన్‌ఆర్‌ఐలు కూడా..
ఇక అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, సింగపూర్, సౌదీలో ఉన్న వాళ్లు సైతం బెట్టింగ్‌లు కాశారు. జమ్మికుంట, కమలాపూర్, భూపాలపల్లి, హుస్నాబాద్, బెజ్జంకికి చెందిన కొంతమంది ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఈటల, గెల్లు గెలుపుపై బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఈ మేరకు తమ సంబంధీకులను సంప్రదిస్తున్నారు. ఎటు వైపు వేయాలి? ఎంత వేయాలి? మెజారిటీ మీద వేయాలా? లేక కేవలం గెలుస్తారని మాత్రమే వేయాలా? అని ఆరా తీసినట్లు సమాచారం. కొందరు ఏకంగా వాట్సాప్ గ్రూపు పెట్టి రూ.10 లక్షల చొప్పున ఇద్దరు అభ్యర్థులపై బెట్టింగ్‌లు వేశారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో 48 మంది ఉన్నారని తెలిసింది.
తగ్గేదే లేదన్న కార్పొరేట్లర్లు
వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్న కొంతమంది లీడర్లు కూడా పోటాపోటీగా బెట్టింగ్‌కు దిగారు. టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న ఎన్నికపై ఎవరు గెలుస్తారన్న దానిపై రూ.20 లక్షల చొప్పున బెట్టింగ్‌కు దిగారు. కరీంనగర్‌లోని ఓ కార్పొరేటర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. బీజేపీ తరఫున గెలిచిన హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కొంతమంది ఈటల 40 వేల మెజారిటీతో గెలుస్తారని రూ.10 లక్షల చొప్పున నలుగురు టీఆర్‌ఎస్ కార్పొరేట్లర్లతో బెట్టింగ్‌లు పెట్టినట్టు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment