పెంపుడు కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బంజారాహిల్స్ సీఐ
సాక్షి, బంజారాహిల్స్: పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడటంతో లాక్‌డౌన్ సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్తున్న యజమానిని శ్రీనగర్‌కాలనీ టీవీ9 చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఆపారు. కారులో కుక్కను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారంటూ బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర యజమానిని ప్రశ్నించారు. గత రాత్రి నుంచి తమ పెంపుడు కుక్క తీవ్ర జ్వరం, విరేచనాలతో వణికిపోతున్నదని ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని యజమాని సోము చెప్పాడు. ఉదయం నుంచి డాక్టర్ కోసం ప్రయత్నిస్తుంటే 12.30 గంటలకు అపాయింట్‌మెంట్ దొరికిందని.. కుక్క ప్రాణాలు కాపాడటానికి బయటికి రావడం తప్పలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
లాక్‌డౌన్ సమయంలో బయటికి రావడమే తప్పని.. కుక్క ప్రాణాలు ముఖ్యమా? నీ ప్రాణాలు ముఖ్యమా? అని ఇన్‌స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న కుక్కను అలాగే ఇంట్లో ఎలా వదిలేస్తాం సార్ అంటూ యజమాని ప్రశ్నించాడు. కుక్కకు ఒంట్లో బాగాలేకపోతే వీడియో కాల్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలని కానీ బయటికి ఎలా వస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జంతు ప్రేమికులు ఇదెక్కడి చోద్యమంటూ ప్రశ్నించారు. నోరు లేని జంతువుల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా అంటూ సోషల్ మీడియా వేదికగా జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని బ్లూ క్రాస్ సొసైటీ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.
చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?!
Comments
Please login to add a commentAdd a comment