ఓ బాలుడిని కొడుతున్న మరో బాలుడు (ఫైల్), గంజాయితో పట్టుబడిన యువకులు (ఫైల్)
సాక్షి, జీడిమెట్ల: కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన కొంతమంది విద్యార్థులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. చిన్న గొడవనే పెద్దదిగా చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.. మరికొందరు కాలేజీలకు వెళ్లకుండా బయట తిరుగుతూ మద్యం, గంజాయి సేవిస్తున్నారు.. అదే మత్తులో గ్యాంగు మాదిరిగా వెళ్లి ఏదో ఒక కారణంతో ఇతరులను చితకబాదుతున్నారు. ఇలాంటి దాడుల్లో కొంతమంది గాయపడుతుండగా మరికొంతమంది మృత్యువాత పడుతున్నారు.
వీరిలో కొంతమంది విద్యార్థులకు పెద్దలంటే గౌరవం లేదు.. పోలీసులంటే భయంలేదు.. భవిష్యత్తుపై కోరిక లేదు..వీరు కొట్లాడే సమయంలో ఎవరైనా వద్దని చెప్పినా వద్దనడానికి నువ్వెవరంటూ అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీంతో రోడ్లపై కొట్లాడుతున్నా వీరిని విడిపించే సాహసం ఎవరూ చేయడం లేదు. దీంతో వారి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రుల అశలు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి వారిలో 9,10, ఇంటర్ విద్యార్థులే అధికం..
పనిచేయని పోలీసుల కౌన్సెలింగ్..
► గంజాయి, మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడి న కొందరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీసుల ఎదుట వారి ఇలాంటివి మళ్లీ చేయమని చెప్పి మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ మళ్లీ పోలీసులకు దొరికినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తల్లిదండ్రుల ఎదుట పోలీసులు వారిని మందలించి వదిలేస్తున్నారు.
మాయ మాటలు చెప్తూ జల్సాలు..
►కొంతమంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్తున్నారు. పుస్తకాలు, పరీక్ష ఫీజులంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులకు వీరి గురించి కాలేజీలకు వెళ్లి అడిగే సమయం లేదు. దీంతో వారు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
చదవండి: రెండు రైళ్లు ఎదురెదుగా వస్తున్నాయ్.. మధ్యలో కవచ్
మద్యం సేవిస్తూ..
►ఎస్ ఆర్ నాయక్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కొంతమంది యువకులు, ఓ అమ్మాయితో కలిసి రాత్రిపూట ఓ ఫ్లాట్‌లో మద్యం సేవిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సదరు ఫ్లాట్ వద్దకు వెళ్లగా రాత్రి 11 గంటలకు గదిలో నుంచి ఐదుగురు అబ్బాయిలు, ఒకఅమ్మాయి బయటకు వచ్చారు. వీరిని విచారించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేలీదు.
►రెండు నెలల క్రితం చింతల్‌లోని ఓ బస్టాపులో ఒకేసారి సామూహికంగా వచ్చిన విద్యార్థులు బస్టాపులో నిల్చొని ఉన్న మరో విద్యార్థిని తీవ్ర ంగా కొట్టి గాయపరిచారు. దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి పరుగు లంకించాడు. అక్కడ ఉన్న కొందరు 100కు సమాచారం అందించారు.
►మూడు నెలల క్రితం ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఓ అపార్టుమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న మరో విద్యార్థితో ఒక నిమిషం గొడవపడ్డారు. అనంతరం ముగ్గురు కలిసి 10వ తరగతి విద్యార్థిని కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులతో చితకబాదారు. దీంతో సదరు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
►ఐదు రోజుల క్రితం ఓ కాలనీలోని పార్కులోమద్యం సేవించిన నలుగురు యువకులు టికెట్ లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సదరు పార్కు సూపర్‌వైజర్ టికెట్ తీసుకోవాలని కోరగా అతనిపైకి దాడికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక వ్యక్తి గొడవ ఎందుకు చేస్తున్నారని అడిగిన పాపానికి అతని తలపై సిమెంట్ రేకుతో కొట్టి గాయపరచి పరారయ్యారు. కాలనీ వాసులు వెంబడించి పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు.
చదవండి: పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు
►ఆరు నెలల క్రితం ఓ ప్రాంతంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తుండగా చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని కేవలం మాటలతో బెదిరించి పోలీసులు వదిలేసినట్లు సమాచారం.
ఓ వ్యక్తిని కొట్టి గాయపరచిన దృశ్యం
ఫిర్యాదు వస్తే కేసులు నమోదు
మాకు ఫిర్యాదు అందితే కచ్చితంగా కేసులు నమోదు చేశాం. ఎవరైనా రోడ్లపై కొట్టుకున్నా విచారి ంచి కేసులు నమోదు చేస్తున్నాం. విద్యార్థులు కొట్టుకున్న సంఘటనల్లో కేసులతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైనా గంజాయి లేక ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు గమనిస్తే మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం.
– కె.బాలరాజు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జీడిమెట్ల
మోటివేషన్ తరగతులు నిర్వహించాలి
విద్యార్థులకు పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహ కార్యక్రమాలతో పాటు మోటివేషన్ తరగతులు నిర్వహించాలి. వీటితో పాటు పిల్లలు కచ్చితంగా కాలేజీలకు స్కూళ్లకు వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. 12 నుంచి 18సంవత్సరాల వరకు పిల్లల కదలికలను, మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. సాధ్యమైనంత వరకు మంచి అలవాట్లు నేర్పించాలి.
– డా.పి.జనార్దన్ రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment