attack on student
-
భయం లేదు.. బాధ్యత లేదు..! విచిత్రంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..
సాక్షి, జీడిమెట్ల: కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన కొంతమంది విద్యార్థులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. చిన్న గొడవనే పెద్దదిగా చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.. మరికొందరు కాలేజీలకు వెళ్లకుండా బయట తిరుగుతూ మద్యం, గంజాయి సేవిస్తున్నారు.. అదే మత్తులో గ్యాంగు మాదిరిగా వెళ్లి ఏదో ఒక కారణంతో ఇతరులను చితకబాదుతున్నారు. ఇలాంటి దాడుల్లో కొంతమంది గాయపడుతుండగా మరికొంతమంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు పెద్దలంటే గౌరవం లేదు.. పోలీసులంటే భయంలేదు.. భవిష్యత్తుపై కోరిక లేదు..వీరు కొట్లాడే సమయంలో ఎవరైనా వద్దని చెప్పినా వద్దనడానికి నువ్వెవరంటూ అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీంతో రోడ్లపై కొట్లాడుతున్నా వీరిని విడిపించే సాహసం ఎవరూ చేయడం లేదు. దీంతో వారి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రుల అశలు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి వారిలో 9,10, ఇంటర్ విద్యార్థులే అధికం.. పనిచేయని పోలీసుల కౌన్సెలింగ్.. ► గంజాయి, మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడి న కొందరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీసుల ఎదుట వారి ఇలాంటివి మళ్లీ చేయమని చెప్పి మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ మళ్లీ పోలీసులకు దొరికినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తల్లిదండ్రుల ఎదుట పోలీసులు వారిని మందలించి వదిలేస్తున్నారు. మాయ మాటలు చెప్తూ జల్సాలు.. ►కొంతమంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్తున్నారు. పుస్తకాలు, పరీక్ష ఫీజులంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులకు వీరి గురించి కాలేజీలకు వెళ్లి అడిగే సమయం లేదు. దీంతో వారు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. చదవండి: రెండు రైళ్లు ఎదురెదుగా వస్తున్నాయ్.. మధ్యలో కవచ్ మద్యం సేవిస్తూ.. ►ఎస్ ఆర్ నాయక్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్లో కొంతమంది యువకులు, ఓ అమ్మాయితో కలిసి రాత్రిపూట ఓ ఫ్లాట్‌లో మద్యం సేవిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సదరు ఫ్లాట్ వద్దకు వెళ్లగా రాత్రి 11 గంటలకు గదిలో నుంచి ఐదుగురు అబ్బాయిలు, ఒకఅమ్మాయి బయటకు వచ్చారు. వీరిని విచారించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేలీదు. ►రెండు నెలల క్రితం చింతల్‌లోని ఓ బస్టాపులో ఒకేసారి సామూహికంగా వచ్చిన విద్యార్థులు బస్టాపులో నిల్చొని ఉన్న మరో విద్యార్థిని తీవ్ర ంగా కొట్టి గాయపరిచారు. దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి పరుగు లంకించాడు. అక్కడ ఉన్న కొందరు 100కు సమాచారం అందించారు. ►మూడు నెలల క్రితం ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఓ అపార్టుమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న మరో విద్యార్థితో ఒక నిమిషం గొడవపడ్డారు. అనంతరం ముగ్గురు కలిసి 10వ తరగతి విద్యార్థిని కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులతో చితకబాదారు. దీంతో సదరు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ►ఐదు రోజుల క్రితం ఓ కాలనీలోని పార్కులోమద్యం సేవించిన నలుగురు యువకులు టికెట్ లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సదరు పార్కు సూపర్వైజర్ టికెట్ తీసుకోవాలని కోరగా అతనిపైకి దాడికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక వ్యక్తి గొడవ ఎందుకు చేస్తున్నారని అడిగిన పాపానికి అతని తలపై సిమెంట్ రేకుతో కొట్టి గాయపరచి పరారయ్యారు. కాలనీ వాసులు వెంబడించి పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. చదవండి: పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు ►ఆరు నెలల క్రితం ఓ ప్రాంతంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తుండగా చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని కేవలం మాటలతో బెదిరించి పోలీసులు వదిలేసినట్లు సమాచారం. ఓ వ్యక్తిని కొట్టి గాయపరచిన దృశ్యం ఫిర్యాదు వస్తే కేసులు నమోదు మాకు ఫిర్యాదు అందితే కచ్చితంగా కేసులు నమోదు చేశాం. ఎవరైనా రోడ్లపై కొట్టుకున్నా విచారి ంచి కేసులు నమోదు చేస్తున్నాం. విద్యార్థులు కొట్టుకున్న సంఘటనల్లో కేసులతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైనా గంజాయి లేక ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు గమనిస్తే మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. – కె.బాలరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల మోటివేషన్ తరగతులు నిర్వహించాలి విద్యార్థులకు పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహ కార్యక్రమాలతో పాటు మోటివేషన్ తరగతులు నిర్వహించాలి. వీటితో పాటు పిల్లలు కచ్చితంగా కాలేజీలకు స్కూళ్లకు వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. 12 నుంచి 18సంవత్సరాల వరకు పిల్లల కదలికలను, మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. సాధ్యమైనంత వరకు మంచి అలవాట్లు నేర్పించాలి. – డా.పి.జనార్దన్ రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
జేఎన్‌యూలో దీపికా పదుకోన్
-
జేఎన్‌యూలో దీపికా పదుకోన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ జేఎన్‌యూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం జేఎన్యూకు వెళ్లిన దీపికా వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే ఈ దాడిలో గాయపడినవారికి సంఘీభావం తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నారు. చదవండి : జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన -
విద్యార్థిని చితక్కొట్టారు, వీడియో వైరల్
లక్నో: దేశంలో విద్వేషపూరిత దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లక్నోలో డ్రైఫ్రూట్స్ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేసిన ఘటన మరువకముందే.. అలలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జీర్ణించుకులేకపోయిన కొందరు వ్యక్తులు ఓ విద్యార్థిని చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోజున ఓ వార్త చానల్ ముజఫర్‌నగర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడించే కార్యక్రమం చేపట్టింది. ఆ సముహంలోని ఓ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో ఓ గ్రూప్ అతనిపై దాడికి దిగారు. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఆ టీవీ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఈ ఘటనను కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. ‘కేవలం ఉద్యోగాలు లేవని మాట్లాడినందుకు నాపై దాడి జరిగింది. వాళ్లు నన్ను టెర్రరిస్టు అంటూ.. భారత్‌కు, బీజేపీకి వ్యతిరేకివి అంటూ దాడికి తెగబడ్డారు. ముజఫర్‌నగర్ పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీడియోలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ’ని తెలిపారు. కాగా, ఈ ఘటనను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
టీవీ చానల్‌తో మాట్లాడుతున్న విద్యార్థిని చితక్కొట్టారు
-
మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో మాత్రం మధులిక జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ సోకడంతో అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. -
కుదుటపడుతున్న మధులిక ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ మేరకు సోమవారం వైద్యబృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాసను తొలగించామని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్స్ సోకకుండా అత్యవసర విభాగంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిన అనంతరం జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక
-
మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థిని మధులికపై కత్తితో జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్రణాళిక ప్రకారమే బాలికపై నిందితుడు భరత్ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మధులిక 9వ తరగతి చదవుతున్నప్పటి నుంచే ప్రేమపేరుతో వెంటపడ్డానని పోలీసుల ముందు భరత్ ఒప్పుకున్నట్లు సమాచారం. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) ఈ మూడేళ్లలో మధులికకు భరత్ రెండు సార్లు ప్రపోజ్ చేశాడని, అమె నిరాకరించడంతోనే కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. మధులిక విషయంలో ఆమె తల్లిదండ్రలు పలు మార్లు భరత్‌ను హెచ్చరించారనీ.. దాడి సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆమె తల్లిదండ్రులను గదిలో బంధించి గడియ వేసి.. మధులికపై కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడి చేశాడనీ తెలుస్తోంది. హత్యాయత్నానికి ముందు కూడా భరత్‌తో బాలిక తండ్రి రాములు గొడవ పడ్డాడు. షీ టీమ్స్‌తో కౌన్సిలింగ్, ఘర్షణలు, ఫిర్యాదుల వీటన్నింటి కారణంగానే ద్వారా భరత్ మధులికపై విపరీతమైన కక్ష పెంచుకుని ఉంటాడనీ అందుకే ఇంత దారుణం చేసి ఉంటాడనీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం భరత్ వాడిన కత్తిని, బ్లడ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగైంది
-
మధులిక కాస్త కోలుకుంది..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక కాస్త కోలుకుందని, సైగలు చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచుతామని వెల్లడించారు. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం ఉంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నాలుగు సర్జరీలు జరిగినందున మధులిక కోలుకోవడనికి సమయం పడుతుందని. మరో 48 గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తల వెనక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామని న్యూరో సర్జన్ శ్రీనివాస్ తెలిపారు. గాయాలకు ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువగా ఉందని, కండరాలు తెగిపోయిన చోట సర్జరీలు చేశామని ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి చెప్పారు. -
మెరుగు పడుతున్న మధులిక ఆరోగ్యం
-
ప్రేమోన్మాది దాడి అత్యంత విషమంగా మధులిక పరిస్థితి
-
పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది భరత్ చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక(17) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయింది. బీపీ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. బాధితురాలి శరీరంపై 14 చోట్ల బలమైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తల పైభాగంలో కత్తిగాటుకు పుర్రె రెండుగా చీలిపోయింది. మెదడులోని కీలక నరాలు తెగిపోయాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉంది. మెడ పైభాగంలోనూ బలమైన గాయమైంది. దవడ సహా రెండు చేతుల మణికట్టుల వద్ద రెండు సెంటీమీటర్ల లోతు తెగిపోయింది. అరచేతులు, వేళ్లపై బలమైన గాట్లు పడ్డాయి. చేతివేలి కీళ్లు విరిగి బయటికి కన్పిస్తున్నాయి. ఎడమచేతి వేలు ఒకటి పూర్తిగా తెగిపోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో ఇప్పటివరకు ఐదు బాటిళ్ల రక్తం ఎక్కించారు. కత్తిగాట్ల వల్ల తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశారు. అధిక రక్తస్రావాన్ని నియంత్రించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. రక్తస్రావం ఆగిపోయి, బీపీ, పల్స్రేట్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. -
బుసలు కొట్టిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రేమోన్మాదం బుసలు కొట్టింది. ప్రేమించడంలేదనే కోపంతో ఇంటర్ విద్యార్థినిపై డిగ్రీ చదువుతున్న యువకుడు దాడికి తెగబడ్డాడు. బుధవారం ఆమె ఇంటికి సమీపంలోనే కాపుకాసి కొబ్బరిబొండాలు నరికే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. 14 చోట్ల తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాడి చేసిన అనంతరం పరారైన నిందితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించారు. బర్కత్‌పుర సత్యనగర్‌కు చెందిన మంగ రాములు, ఉదయ దంపతుల రెండో కుమార్తె మధులిక (17) నల్లకుంట శివం రోడ్డులోని శరత్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే బస్తీలో నివసిస్తున్న వేణుగోపాల్, కళ్యాణి దంపతుల కుమారుడు చిట్కూరి భరత్ అలియాస్ సోను(19) రాంకోఠిలోని జాగృతి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా మధులిక వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గతనెల 7న షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్, మధులికలతో పాటు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మధులికను మళ్లీ వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భరత్‌ను హెచ్చరించి, ఇంటికి పంపించివేశారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. పైగా వేధింపులు మరింత పెంచాడు. ఎంతగా వెంటపడుతున్నా ప్రేమించకపోవడంతో ఆమెపై కక్ష కట్టి, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం కాచిగూడలోని ఓ కొబ్బరిబొండాల దుకాణం నుంచి కత్తి చోరీ చేశాడు. దానిని తన ఇంట్లోనే ఎవరికీ కనపడకుండా దాచిపెట్టాడు. బుధవారం ఉదయం ఆ కత్తిని ఓ పేపర్లో చుట్టి కవర్లో పెట్టుకుని బయటకు వచ్చాడు. మధులిక ఇంటి సమీపంలోనే నివసించే భరత్ సమీప బంధువు ఇంటివద్ద కాపుకాశాడు. తొలుత వాగ్వాదం.. ఆపై దాడి.. ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాలకు బయలుదేరిన మధులికను చూసిన భరత్.. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆ సందు ఇరుకుగా ఉండటంతో అతడిని తప్పించుకుని ఆమె ముందుకు వెళ్లలేకపోయింది. సహాయం కోసం భరత్ కాపుకాసిన ఇంట్లోకి వెళ్లింది. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడం.. ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో వరాండాలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె వెనకే వచ్చిన భరత్.. తన వద్దనున్న కత్తితో మధులికపై దాడి చేశాడు. మెడపై వేటు వేయబోగా.. చేతులు అడ్డం పెట్టుకోవడంతో ఆమె బొటనవేలు తెగిపోయింది. అయినా ఆగని నిందితడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె మెడ, చేతులు, ముఖం, పొట్ట, ఛాతిలో మొత్తం 14 చోట్ల గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడకు వచ్చినప్పటికీ, భరత్ చేతిలో కత్తి ఉండటంతో అతడిని ఆపే ధైర్యం చేయలేకపోయారు. తీవ్ర గాయాలతో మధులిక కుప్పకూలిన తర్వాత భరత్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి, రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తొలుత కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కోసం మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూసీ నది వద్ద పట్టుకున్నాం భరత్‌ను పట్టుకోవడానికి నాలుగు బృందాలు పని చేశాయి. మూసీ నది వద్ద ఓ ఇంట్లో దాక్కుని ఉండగా మాటువేసి అదుపులోకి తీసుకున్నాం. భరత్‌కు ఇప్పటి వరకు ఎలాంటి నేరచరిత్ర లేదు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. మధులిక ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. – ఎం.రమేష్, ఈస్ట్‌జోన్ డీసీపీ -
అసభ్య రాతల్ని అడ్డుకున్న బాలికలపై దాడి
సుపౌల్: స్కూలు గోడలపై అసభ్య రాతలను అడ్డుకున్న విద్యార్థినులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సుపౌల్ జిల్లాలోని దర్పాఖ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) పక్కనే మరో స్కూలు ఉంది. అయితే కేజీబీవీ బాలికలు మైదానంలో ఆడుకుంటుండగా అక్కడకు చేరుకున్న కొందరు పక్క స్కూలు అబ్బాయిలు గోడలపై అసభ్య రాతలు రాశారు. దీంతో ఆ అమ్మాయిలు వీళ్లను తన్నితరిమేశారు. వీరంతా ఇళ్లకు వెళ్లి తమపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తులంతా ఏకమై మైనర్ బాలికలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
విద్యార్థిపై అధ్యాపకుల దాష్టీకం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి వ్యవహార శైలి బాగోలేదని సాకు చూపుతూ సంబంధిత తరగతి అధ్యాపకుడు దాష్టీకం ప్రదర్శించాడు. తనను దుర్భాషలాడాడని విచక్షణ కోల్పోయి చితకబాదడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం జిల్లాకేంద్రంలోని గీతాంజలి ప్రైవేటు కళాశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన హన్మాండ్ల శివయ్య, కృష్ణవేణి దంపతుల ఆదిత్య(18) స్థానిక గీతాంజలి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే శనివారం తరగతులు నిర్వహించిన అధ్యాపకుడు తన క్లాస్ అయిపోయిన తర్వాత అధ్యాపకుడిని సదరు విద్యార్థి దుర్భాషలాడటంతో అది విన్న అధ్యాపకుడు తనను ఈడ్చుకెళ్లి చితకబాదాడు. వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలపడంతో మరో ముగ్గురు కలిసి చావబాదాడని ఆరోపించారు. ఆస్పత్రికి తరలించిన అనంతరం సమాచారం అందించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రికి చేరుకున్న ఎస్ఐ భగవంత్‌రెడ్డి వారి వివరాలు సేకరించారు. విద్యార్థి పరిస్థితిపై వైద్యుడిని వివరణ కోరగా కుడి కాలి తొడ ఎముక క్రాక్ వచ్చిందన్నారు. ఇదిలా ఉండలా కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా విద్యార్థిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. సెలవు రోజు అయినప్పటికీ కళాశాల నడపడంపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థిని కొట్టడానికి గల కారణాలను అడిగారు. దీనిపై సంబంధిత తరగతి గది అధ్యాపకుడు నీళ్లు నమలడంతో కళాశాలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నలుగురిపై కేసు నమోదు నాగర్‌కర్నూల్ క్రైం: ఆదిత్యను కొట్టిన ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కళాశాల డైరెక్టర్ సునేంద్ర, అధ్యాపకులు లక్ష్మణాచారి, రమేష్, నవీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థి ఆదిత్యను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
బొయిపరిగుడ కళాశాలలో విద్యార్థిపై దాడి
జయపురం : కొరాపుట్ జిల్లా సయపుర సబ్‌డివిజన్ పరిధి బొయిపరిగుడ గ్రామంలో గల కళాశాలలో సోమవారం ఊహించని సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థి తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో కళాశాలలో భయానక వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మొదట జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వెంటనే కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. జయపురం సమితిలోని అంబాగుడ గ్రామానికి చెందిన విద్యార్థులు జయరాం డాలి, విజయ ఖొశ్లాలు బొయిపరిగుడ కళాశాలలో +2 చదువుతున్నారు. సోమవారం ఈ ఇద్దరు కలిసి ఒక సైకిల్‌పై కళాశాలకు వెళ్లారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో విషయంపై వివాదం రేగింది. దీంతో కోపోద్రిక్తుడైన వియజ ఖొర కోపంతో జయరాం తలపై ఒక మారణాయుధంతో బాదాడు. ఈ సంఘటనతో కళాశాలలో భయాందోళన చోటుచేసుకుంది. కళాశాల బయట జరిగిన ఈ సంఘటనపై కళాశాల అధికారులు పోలీసులకు తెలుపగా బొయిపరిగుడ పోలీసులు వచ్చి గాయపడిన జయరాం ను వెంటనే జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడినుంచి కొరాపుట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బొయిపరిగుడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిత్రులైన ఆ విద్యార్థుల మధ్య ఏం జరిగింది? వారి మధ్య ఎందుకు వివాదం ఏర్పడిందన్నది కళాశాల విద్యార్థుల మధ్య తీవ్ర చర్చనీయంశమైంది. -
బూటు కాలితో తన్నిన ఘటన; మంత్రి సీరియస్
సాక్షి, తిరుపతి: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని బూటు కాలితో తన్నిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తిరుపతి అన్నమయ్య కూడలిలో గల సదరు కళాశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్.ఐ.ఓతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న అనంతరం ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు బాధ్యుడైన అధ్యాపకుడిపైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. -
నెల్లూరు జిల్లాలో దారుణం
కావలి: నెల్లూరు జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి సాయి పై మహేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.