సాక్షి, హైదరాబాద్: ఆయా సమస్యల పరిష్కారానికి పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. తీరా గడువు ముంచుకొచ్చేంతవరకూ పనులు చేయకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలంలో ముంపు సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎన్‌డీపీ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటైనప్పటికీ.. మళ్లీ వర్షాకాలం వస్తుండగా హడావుడిగా ఇప్పుడు పనులు చేస్తున్నారు.
గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలను వాడవద్దని, చెరువుల్లో వాటిని నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించినా అమలు చేయక.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికిప్పడు ప్రత్యామ్నాయ మార్గాల్లేవని విన్నవించడంతో అదే చివరి అవకాశంగా హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే.
తయారీదారులకు వెళ్లిన ఆదేశాలు..
వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని, మట్టితో చేసే విగ్రహాలు సైతం చెరువుల్లో కాకుండా నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలు అండర్‌టేకింగ్ ఇచ్చాయి. చెరువుల నిమజ్జనాల కోసం బేబి పాండ్స్ వినియోగిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు మాసాల్లో వినాయకచవితి రానుంది. పీఓపీ విగ్రహాలు తయారు చేయకుండా వాటి తయారీదారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి నగరమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
చదవండి: పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..
►పీఓపీ విగ్రహాల తయారీని నిలువరించినా, మట్టితో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా నగరంలో ఉన్న బేబి పాండ్స్ సరిపోవు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీల్లేదు కనుక, ఎక్కడికక్కడ స్థానికంగానే జీహెచ్‌ఎంసీ డివిజన్లు, కాలనీల వారీగా కృత్రిమ తటాకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్ని అవసరమవుతాయో అంచనా వేసి ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభిస్తేనే అసలు సమయానికి సమస్యలు ఎదురు కావని అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.
►తీరా చివరి నిమిషంలో అంటే సరిపడినన్ని కృత్రిమ తటాకాలు నిర్మించడం గాని.. ప్లాస్టిక్‌వి ఏర్పాటు చేయడం గాని కష్టమంటున్నారు. ప్లాస్టిక్‌వి వినియోగించాలనుకున్నా ముందస్తుగా తయారీ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ప్లాన్ ఏమిటో అంతుబట్టడం లేదు. బేబిపాండ్లు, ప్లాస్టిక్ తటాకాల్లో విగ్రహాలను ముంచి,వెంటనే వెలికి తీస్తేనే అవి సరిపోతాయి.లేకుంటే కష్టం. ఇప్పటినుంచే అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో అంతుపట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment