
సాక్షి, హైదరాబాద్: బీజేపీ‘మిషన్ తెలంగాణ’కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సంపాదించడమే లక్ష్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అధికార టీఆర్‌ఎస్‌పై రాజకీయ విమర్శలు, సవాళ్లు, ఆరోపణలు వంటి వాటిపై దూకుడును ప్రదర్శిస్తూనే, హామీల అమల్లో వెనకడుగు, ప్రజా వ్యతిరేక విధానాలపై తగిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేలా వ్యూహాలు అమలు చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండొచ్చునని పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో పోరాట ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించింది.
ఓట్ల శాతం పెరగడంపై ఉత్సాహం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరేడు శాతమున్న పార్టీ ఓట్లు, 2019 లోక్‌సభ ఎన్నికల కల్లా 19.5 శాతానికి చేరుకోవడం బీజేపీ నాయకత్వం, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. మార్చి 14 నుంచి పార్లమెం ట్ బడ్జెట్ తదుపరి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల పరిధిలో నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలను పూర్తిచేయాలని నిర్ణయించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో నాయకు లు, కార్యకర్తలను క్రియాశీలం చేసి, ఎన్నికలకు స న్నద్ధం చేయాలని భావిస్తున్నారు. కిందిస్థాయి నుం చి పార్టీ శ్రేణులను ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేస్తూనే, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తుల ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
మార్చిలో మలివిడత ప్రజా సంగ్రామ యాత్ర!
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా రఘునందన్‌రావు గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా 48 కార్పొరేటర్ల విజయం, హుజూరాబాద్‌లో డబ్బు, అధికారం, ఇతర వనరుల పరంగా మేరుపర్వతంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొని ఈటల రాజేందర్ గెలవడంతో పార్టీ బలం క్రమంగా పుంజుకుంటున్నదని నాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర విజయవంతం కావడం, దీని ద్వారా ప్రభుత్వ, టీఆర్‌ఎస్ వ్యతిరేక ప్రచారంతో పాటు వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను గట్టిగా ఎండగట్టగలిగామని భావిస్తోంది. దీనికి కొనసాగింపుగా మార్చి 2, 3 వారాల్లో మలివిడత ప్రజా సంగ్రామయాత్రను జోగుళాంబ దేవాలయం నుంచి మొదలుపెట్టి భద్రాచలం శ్రీసీతారామచంద్ర ఆలయం వద్ద ముగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment