
సాక్షి,నాగోలు( హైదరాబాద్): మేడిపల్లికి చెందిన ఎల్‌ఐసీ ఉద్యోగి భగవత్ (59) అల్కాపురి చౌరస్తా వద్ద ఉన్న టాటా కార్ల షోరూంలో నూతనంగా టాటా టియాగో ఎస్టీ 1.2 కారును కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తు నుంచి ఓపెన్ లిఫ్టులో తన కారును కిందికు దించుతుండగా అదుపు తప్పి కిందపడింది. దీంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనలో షోరూం కింద ఉన్న పార్కు చేసిన మరో కారు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యింది.
బాధితుడి ఫిర్యాదుతో ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అల్కాపురి చౌరస్తాలో టాటా కార్ల షోరూం భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. షోరూం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓపెన్ లిఫ్టుకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఓపెన్ లిఫ్టు నిర్వహస్తున్న టాటా కార్ల షోరూంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భగవత్‌కు సరిగా డ్రైవింగ్ రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని షోరూం సిబ్బంది చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment