సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: చారిత్రక సైఫాబాద్ మింట్ కాంపౌండ్ మరో అరుదైన ప్రదర్శనకు వేదికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సందర్శకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపాఠి పత్ర ఘోష్ ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌పీఎంసీఐఎల్ డైరెక్టర్‌లు ఎస్.కె.సిన్హా, అజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఒకప్పటి తూకపు బాట్లు
119 ఏళ్ల చరిత్ర కలిగిన మింట్ కాంపౌండ్‌లో నిజాం కాలం నుంచి నాణేలను ముద్రించారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వివిధ రాజుల కాలాల్లో తయారు చేసిన, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన విలువైన నాణేలను, స్మారక చిహ్నాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. మహనీయుల స్మారకార్థం తయారైన నాణేలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సైఫాబాద్ మింట్‌లో యంత్రాల ద్వారా నాణేలను తయారు చేసే ఛాయాచిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
చారిత్రక, సాంస్కృతిక వారధులు..
∙మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో క్రీ.శ 1613 నాటి 11 కిలోల బంగారు నాణెం మొహర్ చిత్రం సందర్శకులను కట్టి పడేస్తోంది. మొఘల్ సామ్రాజ్య ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన నాణేన్ని నిజాంకు జహంగీర్ బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ నాణెం కువైట్‌లో ఉందని చారిత్రక పరిశోధకులు క్రాంతికుమార్ సేవక్ తెలిపారు. ఇలాంటి అరుదైన మొహర్‌లతో పాటు అనేక రకాల నాణేలను, చిహ్నాలను ఈ ప్రదర్శనలో వీక్షించవచ్చు.
ఆయా కాలాల్లో రాజులు ఆరాధించిన దేవతామూర్తుల చిత్రాలు, వారి సాంస్కృతిక జీవితాన్ని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే చిత్రాలతోనూ ఆ కాలంలో నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇక్ష్వాకులు, చాళుక్యులు, శాతవాహనాలు, తదితర రాజుల కాలం నుంచి ఈస్టిండియా వారి ఏలుబడిలో చలామణిలో ఉన్న నాణేల వరకు ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఢిల్లీ సుల్తాన్‌లు, మహ్మద్‌బిన్ తుగ్లక్, మద్రాస్ ప్రెసిడెన్సీ, ట్రావెన్‌కోర్ మహారాజుల ఏలుబడి నాటి నాణేలతో పాటు నిజాం నవాబుల హయాంలో హాలీ చిక్కా నుంచి అణాల వరకు ఇక్కడ కనిపిస్తాయి.
విదేశాల నాణేలు కూడా..
దేశంలోని పలు రాజవంశాల కాలం నాటి నాణేలతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలను కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ తదితర దేశాలకు చెందిన నాణేలు ఇక్కడ కనిపిస్తాయి. బ్రిటీష్ రాజుల కాలంలోని వివిధ కాలాల్లో తయారు చేసిన నాణేలు సైతం ఉన్నాయి. 1835 నుంచి 1947 వరకు చలామణీలో ఉన్న ఈస్టి్టండియా నాణేలు ప్రదర్శనలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment