ఇల్లే భద్రం | Hyderabad COVID 19 Patients Interest on Home Isolation | Sakshi
Sakshi News home page

ఇల్లే భద్రం

Published Fri, Aug 7 2020 8:01 AM | Last Updated on Fri, Aug 7 2020 12:41 PM

Hyderabad COVID 19 Patients Interest on Home Isolation - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆపదలోనూ ఆస్పత్రి కంటే ఇల్లే భద్రంగా భావిస్తున్నారు కోవిడ్‌ బాధితులు.  85 శాతం మందిలో స్వల్ప లక్షణాలుండటంతో వీరికి పెద్దగా వైద్య సేవలు కూడా అవసరం పడటం లేదు. కేవలం 15 శాతం మందికే ఐసీయూ సేవలు అవసరమవుతుంటే.. మూడు నుంచి నాలుగు శాతం మందికే వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమవుతున్నాయి. మిగిలిన వారంతా సాధారణ వైద్యంతో కోలుకుంటున్నారు. కోవిడ్‌ మరణాలు సైతం ఒక్క శాతం లోపే ఉంది. వైరస్‌ సోకగానే చాలామంది భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగులతో పాటు వారికి సహాయంగా వచ్చిన బంధువులతో ఆస్పత్రి పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో ఎవరికి వైరస్‌ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఆస్పత్రులే హాట్‌ స్పాట్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే కంటే.. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న చిట్కాలు పాటించి వైరస్‌ను జయించవచ్చని బాధితులు భావిస్తున్నారు. కోవిడ్‌ బారిన పడిన వారిలో 84 శాతం మంది హోం ఐసోలేషన్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో కేవలం 16 శాతం మందే ఉన్నారు. 

రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ..  
డిసెంబర్‌ చివరి వారంలో చైనాలో కరోనా వైరస్‌ బయటపడింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మన దేశంలోని కేరళలో వెలుగు చూసింది. మార్చి 2న తెలంగాణలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. కొత్త వైరస్‌ కావడం, ఎక్కువ మందికి విస్తరించే అవకాశం ఉండటం.. మందులు లేకపోవడం.. చికిత్స విధానం కూడా తెలియకపోవడంతో వైద్యులతో పాటు ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందారు. మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం కరోనా వైరస్‌పై బస్తీవాసుల్లో విçస్తృతంగా అవగాహన పెరిగింది. వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వైరస్‌ సోకితే.. ఆ తర్వా త ఏం చేయాలి? అనే అంశంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. మందులే లేని రోగానికి చికిత్సల పేరుతో ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోయే కంటే ఇంట్లో ఉండి చిన్నపాటి జాగ్రత్తలతో వైరస్‌ను జయించొచ్చనే అభిప్రాయం సిటిజనుల్లో వ్యక్తమవుతోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినా చాలామంది ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆహారంలో పాలు, పండ్లతో పాటు నిమ్మకాయ, కోడిగుడ్డు, మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకుని వైరస్‌ బారి నుంచి బయటపడుతున్నారు.  

సగానికిపైగా పడకలు ఖాళీ..  
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 73,050 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 40 వేలకుపైగా కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 52,103 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. వీరిలో 30 వేల మంది సిటిజనులే ఉన్నారు. మృతుల్లోనూ 90 శాతం మంది ఇక్కడి వారే. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, వీరిలో ఏడు వేల మంది నగరంలోనే ఉన్నారు. నగరంలోని గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రి, నేచర్‌ క్యూర్‌ సహా కోవిడ్‌ చికిత్సల కోసం అనుమతి పొందిన కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 6,556 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరో 8,493 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మెడికల్‌ బులెటిన్‌లో స్పష్టం చేసింది. అయితే నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఐసీయూ పడకల విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న బాధితులకు పడకలు ఖాళీ లేవని చెబుతున్నాయి. కేవలం క్యాష్‌ పెయింగ్‌ రోగులను మాత్రమే చేర్చుకుంటున్నాయి. మందులే లేని రోగానికి ఖరీదైన మందులు వాడినట్లు చూపించి భారీగా బిల్లులు దండుకుంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement