సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని వాహనాలను కొనుగోలు చేసి ఏజెంట్‌ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. మరోవైపు ఇలాంటి అక్రమ వాహనాలపై కొందరు దళారులు తప్పుడు డాక్యుమెంట్‌లను సృష్టించి కొందరు ఆర్టీఏ అధికారుల సహకారంతో అధికారికంగా నమోదు చేయిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా అక్రమ వాహనాల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తరచూ ఇలాంటి వాహనాలను పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట పడటంలేదు.
ఇదో మచ్చుతునక..
కొద్ది రోజుల క్రితం నగరంలోని మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయలేదు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) నకిలీదని తేలింది. నగరంలో లభించే సెకండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీకి చెందిన వాహనాలు తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది ఎలాంటి పత్రాలు పరీక్షించుకోకుండానే కొనుగోలు చేసి మోసపోతున్నారు.
ఎన్‌ఓసీ ఎంతో కీలకం..
► ఎలాంటి వాహనమైనా సరే ఒకరి నుంచి మరొకరికి యాజమాన్య బదిలీ అయ్యే సమయంలో నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఎంతో కీలకం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినా తప్పనిసరిగా ఎన్‌ఓసీ ఉండాల్సిందే. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన వాహనాన్ని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు వాహనం మొదటి యజమానికి పేరిట నమోదైన రిజి్రస్టేషన్ పత్రాలను అక్కడి ఆర్టీఏ అధికారులకు సమరి్పంచి ఎన్‌ఓసీ పొందాలి. దాని ఆధారంగా హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారులు తిరిగి నమోదు చేస్తారు. చట్టబద్ధంగా ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినట్లు నిరూపించుకోవాలి. కానీ.. ఢిల్లీ, హరియాణా నుంచి తరలిస్తున్న వాహనాలకు ఇలాంటి కీలకమైన డాక్యుమెంట్‌లు లేకపోవడం గమనార్హం.
► గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3వేలకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలే. ఢిల్లీ, హరియాణాలతో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదువుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఉన్నట్లు అంచనా. వీటిపైన ఎక్కువ ఆదాయం లభిస్తూండడంతో ఏజెంట్‌లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment