ఫార్ములా ఈ–రేస్ లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి. చిత్రంలో జయేశ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ–రేస్ (ఫార్ములా ఈ–ప్రిక్స్)కు ప్రాచుర్యం కల్పించేందుకు 2023 ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్ ఈ–మొబిలిటీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. విద్యుత్‌తో నడిచే సింగిల్ సీటర్ కార్ల పోటీకి సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 6న హైదరాబాద్ ఈవీ సమిట్, ఫిబ్రవరి 7న ర్యాల్–ఈ హైదరాబాద్, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఈ–మోటార్ షోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పలు ఈవీ వాహన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని చెప్పారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ–రేస్ వెబ్‌సైట్, కార్యక్రమాల షెడ్యూల్, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఈ–రేసింగ్ అతిపెద్ద ఈవెంట్ అని, లక్షలాది మంది దీన్ని తిలకించే అవకాశం ఉందన్నారు.
ఈ పోటీలను ఈ–రేసింగ్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయని వివరించారు. ఈ–రేస్‌లో మొత్తం 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొంటారని... భారత్‌లో మహీంద్ర రేసింగ్ టీమ్ ఇందులో పాల్గొంటుందన్నారు. ఈ–రేసింగ్ జరిగే నెక్లెస్‌రోడ్‌లోని 2.8 కి.మీ. ట్రాక్‌కు ఇరువైపులా దాదాపు 50 వేల మంది ప్రత్యక్షంగా రేసింగ్‌ను వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఏటా నగరంలో ఈ పోటీలు జరగాలని ఆశిస్తున్నామన్నారు. రేసింగ్ పోటీలకు ముందే ట్యాంక్‌బండ్ మార్గంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, అమరవీరుల స్మారక ఆవిష్కరణతోపాటు, కొత్త సచివాలయం ప్రారంభం అవుతాయ ని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment